Tirumala: తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 24న నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ సిబ్బంది ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu), ఈవో అనిల్ సింఘాల్ (EO Anil Singhal), పలువురు టీటీడీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఆలయ శుద్ధి అనంతరం స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నేపథ్యంలో సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ (TTD) రద్దు చేసింది. ఈ సందర్భంగా ఈవో అనిల్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్, అధికారులు సిబ్బందితో కలిసి ఆలయాన్ని శుద్ధి చేశామన్నారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే లక్షలాది భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు టీటీడీ బోర్డు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోందని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి మూలవిరాట్ దర్శనంతో పాటు వాహనసేవలను వీక్షించే అవకాశం కల్పిస్తామని తెలిపారు.