Stray Dogs: సుప్రీంకోర్టులో వీధి కుక్కల పంచాయితీ..!
దేశవ్యాప్తంగా వీధి కుక్కల (Stray Dogs) సమస్యపై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రజల భద్రత, జంతు సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ఈ సమస్యను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కోర్టు స్పష్టం చేసింది.
వీధికుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులు, ఇతర ముఖ్యమైన రోడ్లు, ఎక్స్‌ప్రెస్ వేలపై వీధి కుక్కలు, ఇతర పశువులు రాకుండా ఉండేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించింది. స్కూళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు వంటి ముఖ్యమైన ప్రభుత్వ ప్రాంతాలలో వీధి కుక్కలు ప్రవేశించకుండా ఉండేందుకు 8 వారాల్లో తగిన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని తెలిపింది. ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిన స్థలాలను, భవనాలను 2 వారాల్లో మున్సిపల్ సిబ్బంది గుర్తించాలని పేర్కొంది. గుర్తించిన ప్రాంతాలలో తిరిగే వీధి కుక్కలను తప్పనిసరిగా స్టెరిలైజేషన్ చేసి, వాటిని పట్టుకున్న ప్రాంతాలలో కాకుండా వేరే చోటకు తరలించాలని సూచించింది. వీధి కుక్కలను పట్టుకున్న ప్రాంతాలలో తిరిగి వదిలిపెట్టకూడదని కోర్టు స్పష్టంగా ఆదేశించింది. పబ్లిక్ ఏరియాలలో వీధి కుక్కలు తిరగకుండా ఉండేందుకు మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించాలని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.
కోర్టు ఆదేశాల అమలును పర్యవేక్షించడానికి అన్ని రాష్ట్రాలు తగిన యంత్రాంగం సిద్ధం చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. అమలు తీరుపై 8 వారాల్లోగా స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టుకు అందజేయాలని ఆదేశించింది. వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ సమర్పించిన నివేదికను కూడా అమలు చేయాలని, దాని అమలుపై అఫిడవిట్‌ను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఒకవేళ ఈ ఆదేశాలను అమలు చేయడంలో కానీ, నివేదిక సమర్పించడంలో కానీ విఫలమైతే, తీవ్ర పరిణామాలు తప్పవని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
ప్రజల రక్షణ, ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా నిర్లక్ష్యం వీడి, కోర్టు ఆదేశాల మేరకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటేనే వీధి కుక్కల బెడద అదుపులోకి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఆదేశాల అమలు ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి సుప్రీంకోర్టులో తదుపరి విచారణ కీలకం కానుంది.







