YS Jagan: కోర్టుకు రాలేను.. ప్లీజ్!
అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (YS Jagn), కోర్టులో వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో (CBI Court) ఈ మేరకు మెమో దాఖలు చేశారు. యూరప్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని గతంలో కోర్టు ఆదేశించింది. ఆ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని కోరుతూ తాజాగా జగన్ ఈ మెమో ద్వారా కోర్టును అభ్యర్థించారు.
జగన్ యూరప్ పర్యటనకు (Europe Tour) వెళ్లేందుకు సీబీఐ కోర్టు గతంలో అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 1 నుంచి 30వ తేదీలోగా 15 రోజులపాటు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ అనుమతిని జారీ చేసేటప్పుడు కోర్టు కొన్ని షరతులు విధించింది. పర్యటనకు బయలుదేరే ముందు పూర్తి వివరాలు, ఫోన్ నంబర్, ఈమెయిల్ వంటి డీటెయిల్స్ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత నవంబరు 14 లోపు కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టమైన షరతు విధించింది.
యూరప్ పర్యటనను పూర్తి చేసుకుని వై.ఎస్. జగన్ తిరిగి ఇండియాకు వచ్చేశారు. కోర్టు విధించిన నవంబర్ 14 గడువు సమీపిస్తోంది. ఆయన ఇంకా కోర్టు ఎదుట హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఇందుకోసం ఆయన అనేక కారణాలను వెల్లడించారు. ఈ కేసులో తన తరఫున తన న్యాయవాది ప్రత్యేక వకాల్తా కింద కోర్టుకు హాజరుకావడానికి గతంలో హైకోర్టు అనుమతి మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో, తాను వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేదని పరోక్షంగా పేర్కొన్నారు. తాను కోర్టు ముందు హాజరుకావాలంటే, రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని, దీని వల్ల ప్రభుత్వ యంత్రాంగంపై అదనపు భారం పడుతుందని మెమోలో వివరించారు. ఒకవేళ తప్పనిసరి అని కోర్టు భావిస్తే, తాను హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నానని జగన్ పేర్కొన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని జగన్ మెమోలో స్పష్టం చేశారు.
ప్రస్తుతం, జగన్ దాఖలు చేసిన ఈ మెమో సీబీఐ కోర్టు పరిశీలనలో ఉంది. ఈ అభ్యర్థనపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది కీలకం కానుంది. ఒకవైపు హైకోర్టు ప్రత్యేక వకాల్తాకు అనుమతి ఇవ్వడం, మరోవైపు రాష్ట్ర యంత్రాంగంపై భారం పడుతుందనే వాదన నేపథ్యంలో కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. విదేశీ పర్యటన ముగిసిన తర్వాత వ్యక్తిగత హాజరుకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కోర్టు తీర్పు ఈ కేసు భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది.







