PM Narendra Modi:చొరబాటుదారులను కాపాడుతున్నారు.. విపక్షాలపై మోడీ ఫైర్:
కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులను రక్షిస్తున్నాయని, రాముడిని ద్వేషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఆరోపించారు. బిహార్లోని భాగల్పూర్, అరారియా జిల్లాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆయన ప్రసంగించారు. నిషాద్ రాజ్, మాతా శబరి, మహర్షి వాల్మీకిలకు అంకితం చేసిన పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి కూడా విపక్ష నేతలు విముఖత చూపడం, దళితులు, వెనుకబడిన తరగతుల పట్ల వారికి ఉన్న ద్వేషానికి నిదర్శనమని మోడీ (PM Narendra Modi) నొక్కి చెప్పారు. ఆర్జేడీ 15 ఏళ్ల ‘జంగిల్ రాజ్’ పాలనలో బిహార్ అభివృద్ధి చెందలేదని, రోడ్లు, విద్యారంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలిపారు.
“ప్రతి చొరబాటుదారుడిని దేశం నుంచి తరిమికొట్టేందుకు ఎన్డీయే (NDA) కట్టుబడి ఉంది, కానీ కాంగ్రెస్, ఆర్జేడీలు వారికి రక్షణ కల్పిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి,” అని మోడీ (PM Narendra Modi) మండిపడ్డారు. దేశంలోకి చొరబాటుదారులను అనుమతించడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించడం దేశ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. బిహార్ అంతటా ఎన్డీయే విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







