America: చట్టవిరుద్ధంగా మా దేశానికి వస్తే.. అక్కడికి పంపిస్తాం

అమెరికాలోని ఓ మోటెల్‌లో క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడి చేతిలో భారతీయుడు చంద్ర నాగమల్లయ్య (Chandra Nagamallaiah) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారులపై కఠిన ఆంక్షలు అమలు చేయడానికి అమెరికా సిద్ధమవుతోంది. బైడెన్ (Biden) హయాంలో క్యూబా (Cuba) కు చెందిన అక్రమ వలసదారుడిని అమెరికాలోకి అనుమతించకపోయి ఉంటే దారుణ హత్య జరిగేది కాదని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ( డీహెచ్‌ఎస్) వ్యాఖ్యానించింది. క్రూరమైన రాక్షసుడు ఓ వ్యక్తి తల నరికివేశాడు. బాధిత కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఈ దారుణానికి పాల్పడ్డాడు. చంపిన తర్వాత మృతుడి తలను కొడుతూనే ఉన్నాడు. యోర్డానిస్ కోబోస్ మార్టినెజ్ ఒక మోటల్‌లో దారుణంగా హత్య చేశాడు. ఈ నేరస్థుడిని బైడెన్ పరిపాలన కాలంలో మన దేశంలోకి అనుమతించకపోయి ఉంటే ఇది జరిగేది కాదు అని పేర్కొంది.
అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కఠినచర్యలు తీసుకోవడానికి మార్టినెజ్ లాంటి ఉదంతాలే కారణమని డీహెచ్‌ఎస్ పేర్కొంది. అందుకే మూడోస్థాయి దేశాల నేరస్థులను అమెరికా దాటిస్తున్నామని తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కార్యదర్శి క్రిస్టినోమ్ ఇకపై అనాగరిక నేరస్థులు అమెరికాలో నిరవధికంగా ఉండటానికి అనుమతించడం లేదు. చట్టవిరుద్ధంగా మా దేశానికి వస్తే, ఎస్వాటిని, ఉగాండా, దక్షిణ సూడాన్, సెంట్రో ద కన్ఫినామింటో డెల్ టెర్రరిజం స్థావరానికి పంపిస్తాం అని హెచ్చరించింది.