Supreme Court: నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఎస్ఐఆర్‌ను రద్దు చేస్తాం: సుప్రీంకోర్టు

బిహార్ ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Bihar SIR) కోసం ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలినా మొత్తం ప్రక్రియను రద్దు చేస్తామని ఎన్నికల కమిషన్‌ను (ECI) సుప్రీంకోర్టు (Supreme Court) హెచ్చరించింది. అయితే రాజ్యాంగ సంస్థగా ఈసీ సరైన పద్ధతినే అనుసరించిందని భావిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. బిహార్‌లోని ఓటరు జాబితా (Bihar SIR) సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఓటరు గుర్తింపునకు ఆధార్‌ను పరిగణించాలని సుప్రీంకోర్టు (Supreme Court) గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పునరుద్ఘాటించింది. ఆధార్ పౌరసత్వానికి రుజువు కానప్పటికీ, అది ప్రజల గుర్తింపునకు చట్టబద్ధమైన సాక్ష్యమని న్యాయస్థానం (Supreme Court) స్పష్టం చేసింది. ఈసీ అధికారులు ఆధార్‌ను అంగీకరించడానికి నిరాకరిస్తున్నారన్న ఫిర్యాదులను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ కేసుపై తుది వాదనలు అక్టోబరు 7న జరుగుతాయని కోర్టు తెలిపింది.