Congress: జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు..!? వ్యూహం రెడీ..!!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ బైపోల్ (jubilee hills assembly byelection) ముంచుకొస్తోంది. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) గుండెపోటుతో మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఈ సీటును కైవసం చేసుకున్నప్పటికీ, ఇప్పుడు అధికార కాంగ్రెస్ (congress) పార్టీ దీన్ని తిరిగి చేజిక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో జరిగిన కీలక సమావేశంలో రేవంత్ రెడ్డి, పార్టీ కేడర్ తో కలిసి వ్యూహరచన చేశారు. అభ్యర్థి ఎంపికను హైకమాండ్ కు వదిలేద్దాం అని చెప్పినా, ఇప్పటికే కేండిడేట్ పై ఒక క్లారిటీ వచ్చినట్లు సమాచారం. త్వరలోనే అధికారికంగా నవీన్ యాదవ్ పేరు ఖరారు చేస్తారని తెలుస్తోంది. నవీన్ యాదవ్ గెలుపు బాధ్యతను పార్టీ నేతలు, మంత్రులు, స్థానిక కార్యకర్తలకు రేవంత్ రెడ్డి అప్పగించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కేడర్ తో సమీక్ష నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలవడం ముఖ్యమని, అభ్యర్థి ఎవరైనా, అందరూ కలిసి పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ ఎన్నికలో గెలవడం ద్వారా ప్రభుత్వ స్థిరత్వాన్ని, ప్రజాధరణను మరింత బలోపేతం చేసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రేవంత్ పనైపోయిందని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, ఈ సీటును కైవసం చేసుకోవడం ద్వారా తన సత్తాను చాటుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. మొదట్లో మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ మొహమ్మద్ అజారుద్దీన్ పేరు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్, ఈసారి కూడా టికెట్ కోరుకున్నారు. అయితే, పార్టీ ఇటీవల అతన్ని ఎమ్మెల్సీగా ఎన్నిక చేసింది. దీంతో అజారుద్దీన్ బరి నుంచి వైదొలిగినట్లే. ప్రస్తుతం, బీసీ నేత నవీన్ కుమార్ యాదవ్ (Navin Kumar Yadav) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడైన నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం పార్టీ తరపున 2014లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మంచి ఓటు బ్యాంకు సాధించారు. 2023లో కాంగ్రెస్‌లో చేరి, అజారుద్దీన్ పక్షాన్ని బలపరిచారు. ఇప్పుడు అతనికి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
నవీన్ యాదవ్ ఎంపికకు మరో కారణం జూబ్లీహిల్స్ లో యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం. నవీన్ యాదవ్ కు ఎంఐఎం కూడా మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థి వైపు మొగ్గు చూపింది. ఇటీవల బీసీ రిజర్వేషన్లకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కచ్చితంగా తమ పార్టీ గెలుపుకు దోహదపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. నవీన్ యాదవ్ ఇప్పటికే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా తన పోస్టర్లు కనిపిస్తున్నాయి. వినాయక చవితి, దసరా పండగలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. ఇటీవల సామూహిక సీమంతాలు నిర్వహించారు.
బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతా గోపీనాథ్ అభ్యర్థిత్వం ఖరారైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఈ సీటును కాపాడుకోవాలని పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ (BJP) ఇంకా అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకోలేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎల్.దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్‌చందర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ ఉపఎన్నిక బాధ్యత తీసుకున్నారు. అర్బన్ లో తమకు గణనీయమైన ఓట్ బ్యాంక్ ఉందని, త్రిముఖ పోరులో తమకు కలిసొస్తుందని బీజేపీ నమ్ముతోంది. మరోవైపు కవిత కూడా తెలంగాణ జాగృతి తరపున అభ్యర్థిని బరిలో నిలిపే అవకాశం ఉందని సమాచారం.