By Election: జుబ్లీహిల్స్ పోటీలో కవిత, తీన్మార్ మల్లన్న..? I

భారత రాష్ట్ర సమితి(BRS) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో, ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. బీహార్ ఎన్నికలతో పాటుగా ఈ ఉపఎన్నికను నిర్వహించనున్నారు. అయితే ఈ ఉపఎన్నిక విషయంలో కీలక రాజకీయ పార్టీలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాయి.. అనేదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత నెలకొన్న, ఈ అసెంబ్లీ ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్(congress).. బీఆర్ఎస్, అలాగే బిజెపి అభ్యర్థుల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఒక్క బిఆర్ఎస్ మాత్రమే మాగంటి గోపీనాథ్ సతీమణిని ఎన్నికల్లో నిలబెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇక కాంగ్రెస్, బిజెపి ఏ నిర్ణయం తీసుకోబోతున్నాయి, అనేదానిపై చాలా వరకు ఊహాగానాలు వినపడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అంతకుముందు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పోటీ చేస్తారని భావించారు. కానీ అనూహ్యంగా ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు సిఎం రేవంత్ రెడ్డి.
ఇక టిడిపి కూడా ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉందని, బిజెపి పక్కకు తప్పుకుని టిడిపికి అవకాశం ఇవ్వాలని భావించినట్లు సైతం వార్తలు వచ్చాయి. దీనితో నందమూరి సుహాసిని పేరు ప్రధానంగా చర్చల్లోకి వచ్చింది. ఇక ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు సైతం బలంగా వినపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా భారత రాష్ట్ర సమితి విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ఆమెను, ఇటీవల సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ తరుణంలో తెలంగాణ జాగృతి నుంచి ఆమె జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో పోటీ చేయవచ్చని భావిస్తున్నారు. లేదంటే కోర్టు తీర్పు ద్వారా ఎమ్మెల్సీ పదవి కోల్పోయిన అలీ ఖాన్, ఇక్కడ కవిత తరపున నిలబడే అవకాశం ఉందనే వార్తలు సైతం వినపడుతున్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ విషయంలో అసహనంగా ఉన్నారు. దీనితో ఆమెను కవిత నిలబెట్టే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అక్కడ ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉండటంతో, ఆయనను నిలబెడితే కాంగ్రెస్ కు కచ్చితంగా ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయని, కవిత భావిస్తున్నట్లు సమాచారం. ఇక కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించిన, తీన్మార్ మల్లన్న సైతం ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.