TRSA: కవిత కొత్త పార్టీ పేరులో అసలు ‘గుట్టు’ ఇదేనా?
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) పేరుతో కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, ఈ ప్రకటన వెనుక ఒక మతలబు కనిపిస్తోంది. ‘TRS’ అని పిలుచుకుంటున్న ఈ పార్టీ అసలు పేరులో ‘Association’ అనే పదం నిగూఢంగా ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కవిత విడుదల చేసిన అధికారిక పోస్టర్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన విషయం గమనించవచ్చు. పెద్ద అక్షరాలతో ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని, ఇంగ్లీష్‌లో Telangana Rashtra Sena అని ప్రముఖంగా కనిపిస్తోంది. అయితే దాని కింద అత్యంత చిన్న అక్షరాలతో ‘Association’ అని ముద్రించి ఉంది. అంటే సాంకేతికంగా ఈ పార్టీ పేరు Telangana Rashtra Sena Association (TRSA) అని స్పష్టమవుతోంది. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా తన పూర్తి పేరును ప్రచారంలో ఉంచడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడ ‘అసోసియేషన్’ అనే పదాన్ని దాదాపు కనిపించకుండా జాగ్రత్త పడటం వెనుక “TRS” అనే బ్రాండ్ ఇమేజ్ను తిరిగి సొంతం చేసుకోవాలనే తపన కనిపిస్తోంది.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, గతంలో ఉనికిలో ఉన్న లేదా ప్రస్తుతం రిజిస్టర్ అయి ఉన్న పార్టీల పేర్లను పోలిన పేర్లతో కొత్త పార్టీలను అనుమతించడం చాలా కష్టం. ఒకప్పుడు కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి -TRS ఇప్పుడు భారత రాష్ట్ర సమితి- BRSగా రూపాంతరం చెందింది. అయినప్పటికీ, పాత TRS పేరుకు ఉన్న గుర్తింపు, ఆ సెంటిమెంట్ ఇంకా ప్రజల్లో బలంగా ఉంది.
నిబంధనల ప్రకారం నేరుగా TRS పేరుతో రిజిస్ట్రేషన్ పొందడం సాంకేతిక సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే, దానికి ‘Association’ అనే పదాన్ని తగిలించి ‘TRSA’గా నమోదు చేసి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం అవుతుంది. సాంకేతికంగా అది కొత్త పేరుగా పరిగణిస్తారు. ప్రజల్లోకి వెళ్లేటప్పుడు మాత్రం ‘అసోసియేషన్’ను పక్కన పెట్టి, కేవలం ‘TRS’గా చలామణి అవ్వడానికి అవకాశం ఉంటుంది.
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రజల డీఎన్ఏలో కలిసిపోయిన పేరు TRS. ప్రస్తుతం BRS పార్టీ రాజకీయంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతుందన్న వాదనల నేపథ్యంలో, తిరిగి అదే పాత పేరుతో ప్రజల ముందుకు వెళ్లడం వల్ల ఇన్స్టంట్ మైలేజ్ లభిస్తుందని కవిత భావిస్తున్నట్లు కనిపిస్తోంది. TRSకి, TRSAకి పెద్ద తేడా ఉండదు కదా అనే ఆలోచనే ఈ పేరు ఎంపిక వెనుక ఉన్న అసలు సారాంశం. ప్రజల నోళ్లలో TRS అనే పదమే నానుతుంది కాబట్టి, రికార్డుల్లో TRSA ఉన్నా పర్వాలేదనేది వారి ఎత్తుగడగా కనిపిస్తోంది. ‘అసోసియేషన్’ అనే పదాన్ని ఇగ్నోర్ చేసి, కేవలం తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రచారం చేయడం ద్వారా పాత గతాన్ని, సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవాలని కవిత వర్గం గట్టి ప్రయత్నమే చేస్తోంది.






