Kavitha: లిక్కర్ కేసు నుంచి విముక్తి..! తిరుమలకు కాలినడకన కవిత..!!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె సుమారు 6 నెలల పాటు తీహార్ జైలులో రిమాండ్లో ఉండాల్సి వచ్చింది. అయితే, ఇటీవల ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసులో కీలక తీర్పు చెప్పింది. కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా వంటి 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. సీబీఐ సరైన ఆధారాలను సమర్పించలేకపోయిందని కోర్టు పేర్కొనడం కవితకు పెద్ద ఊరటనిచ్చింది.
న్యాయపరమైన చిక్కుల నుంచి విముక్తి లభించిన తర్వాత, కవిత తన ఆధ్యాత్మిక మొక్కులను చెల్లించుకోవడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆమె అలిపిరి నుంచి మెట్ల మార్గంలో కాలినడకన కొండపైకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 5న ఆమె తిరుపతికి చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం అలిపిరి నుంచి నడక ప్రారంభిస్తారు. 6వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అభిషేక సేవలో పాల్గొంటారని తెలుస్తోంది.

కవిత తిరుమల పర్యటన కేవలం ఆధ్యాత్మికమైనదేనా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. ఈ పర్యటన వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె రాజకీయ అడుగులు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపింది. అయితే తాను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు శాసనమండలిలోనే ప్రకటించారు. లిక్కర్ కేసులో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత రెండు నెలల్లో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు సంకేతాలిచ్చారు. తిరుమల పర్యటన ముగిసిన వెంటనే ఈ విషయంపై ఆమె ఒక స్పష్టమైన కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల కోసం పని చేసే ‘తెలంగాణ జాగృతి’ సంస్థను ఆమె పార్టీగా మార్చే అవకాశాలున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తనకు పార్టీలో జరిగిన అన్యాయాన్ని, లిక్కర్ స్కాంను రాజకీయ కక్షసాధింపుగా వాడుకోవడాన్ని కవిత ప్రజలకు వివరించే అవకాశం ఉందని సమాచారం. కఠినమైన జైలు జీవితం, న్యాయపోరాటం తర్వాత ఆధ్యాత్మిక శక్తిని పొంది, కొత్త ఉత్సాహంతో రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని ఆమె భావిస్తున్నారు.
మొత్తానికి కల్వకుంట్ల కవిత తిరుమల పర్యటన అటు భక్తిని, ఇటు భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని కలగలిపిన ఒక కీలక ఘట్టం. మద్యం కేసు మచ్చను తుడిచేసుకుని, స్వామివారి ఆశీస్సులతో ఆమె తన రాజకీయ ప్రస్థానంలో ఏ మలుపు తీసుకోబోతున్నారో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి

















