BMX: యూఎస్ఏ గ్రాండ్ నేషనల్స్‌లో హైదరాబాద్ కుర్రాడు అగస్తీ ప్రభంజనం!
హైదరాబాద్: అంతర్జాతీయ బీఎంఎక్స్ (BMX) రేసింగ్ రంగంలో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తూ హైదరాబాద్‌కు చెందిన 16 ఏళ్ల అగస్తీ చంద్రశేఖర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని ఓక్లహోమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ‘యూఎస్ఏ గ్రాండ్ నేషనల్స్’లో ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న 48 మంది మేటి రైడర్లలో అగస్తీ 4వ స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. భారత్ నుండి ఈ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి మరియు ఏకైక బీఎంఎక్స్ రేసర్‌గా అగస్తీ రికార్డు నెలకొల్పాడు.
అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రదర్శన: నవంబర్ 26 నుండి 30 వరకు జరిగిన ఈ రేసులో అగస్తీ తన అసాధారణ ప్రతిభను చాటుకున్నాడు. ఏటా కొత్త ట్రాక్‌లను నిర్మించి నిర్వహించే ఈ కఠినతరమైన పోటీలో పోరాడి 4వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. కేవలం ఈ పోటీలోనే కాకుండా, గత మూడు నెలలుగా అమెరికా సర్క్యూట్లో అగస్తీ పతకాల పంట పండిస్తున్నాడు. అరిజోనా నేషనల్స్‌లో నాలుగు స్వర్ణాలు, నెవాడా స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో మరో బంగారు పతకాన్ని గెలుచుకుని తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు.
సౌకర్యాల కొరత ఉన్నా తగ్గని పట్టుదల: భారతదేశంలో ప్రస్తుతానికి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బీఎంఎక్స్ రేసింగ్ ట్రాక్‌లు లేవు. దీనివల్ల అగస్తీ తన శిక్షణ కోసం మలేషియా, అమెరికాలోని లాస్ వేగాస్‌కు వెళ్లాల్సి వస్తోంది. 2016 ఒలింపిక్ బంగారు పతక విజేత కానర్ ఫీల్డ్స్ పర్యవేక్షణలో అగస్తీ ప్రస్తుతం రాటుదేలుతున్నాడు. శిక్షణా సౌకర్యాల కొరత ఉన్నప్పటికీ, పట్టుదలతో విదేశీ గడ్డపై శిక్షణ పొందుతూ దేశానికి పతకాలు అందిస్తున్నాడు.
కుటుంబం, ఫెడరేషన్ సహకారం: అగస్తీ విజయాల వెనుక అతని తల్లిదండ్రులు చంద్రశేఖర్, అనూపల ప్రోత్సాహం ఎంతో ఉంది. ఒక సామాన్య అథ్లెట్ కంటే బీఎంఎక్స్ రేసర్ ప్రయాణం భారత్‌లో ఎంతో కష్టతరమని, అయితే సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (CFI) సెక్రటరీ మణిందర్ సింగ్ అందిస్తున్న సహకారం వల్ల తమ పర్యటనలు, డాక్యుమెంటేషన్ సులభం అవుతున్నాయని వారు పేర్కొన్నారు.
లక్ష్యం.. 2032 ఒలింపిక్స్ స్వర్ణం: ఫిబ్రవరి 2023లో మలేసియా నేషనల్స్‌లో రజతం సాధించిన అప్పటి నుండి అగస్తీ వెనుదిరిగి చూడలేదు. 2032లో బ్రిస్బేన్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో భారతదేశం తరపున బంగారు పతకాన్ని గెలవడమే తన అంతిమ లక్ష్యమని ఈ యువ రేసర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌కు చెందిన హంజా ఖాన్, కమలేష్ తిగుళ్లతో పాటు ప్రత్యేక న్యూట్రిషన్స్, సైకాలజిస్టుల బృందం అగస్తీని ఒలింపిక్స్ వైపు నడిపిస్తోంది. భారత బీఎంఎక్స్ రంగానికి అగస్తీ ఒక దిక్సూచిలా మారి, భవిష్యత్తులో మరెందరో యువతను ఈ క్రీడ వైపు ఆకర్షిస్తున్నాడు.






