GHMC: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ (GHMC) వార్డులను 300కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 150 వార్డులు ఉండగా, 300కు పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్ను (Notification) విడుదల చేసింది. ఇటీవలే నగర పరిధిలోని 27 మున్సిపాలిటీల (Municipalities)ను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ వార్డు రీఆర్గనైజేషన్ స్టడీ రిపోర్డు ఆధారంగా ప్రభుత్వం వార్డుల సంఖ్య పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 27 అర్బన్ లోకల్ బాడీల డేటాను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను కమిషనర్ సమర్పించారు. ఈ అధ్యయనం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో పెరిగిన జనాభా, పట్టణ విస్తరణను పరిగణనలోకి తీసుకుని జీహెచ్ఎంసీ చట్టం 1955(సెక్షన్ 8, సెక్షన్ 5) నిబంధనల ప్రకారం కొత్త వార్డుల సంఖ్యను ఖరారు చేసింది. ముద్రణ శాఖకు 500 ప్రతులను అందించాలని కూడా సూచించారు. జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజన, భవిష్యత్తులో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల (Corporation Election)కు కీలకంగా మారనుంది. గెజిట్ విడుదల అయిన తర్వాత వారం పాటు అభ్యంతరాలకు అవకాశం ఇవ్వనుంది. ఆ తర్వాత మార్పులు, చేర్పులు చేసి నోటిఫికేషన్ ఫైనల్ చేయనుంది.
– NS GOUD






