గ్రీన్ లో అన్నీ ఓపెన్ : కేసీఆర్
రాష్ట్రంలో కంటెయిన్మెంట్ ప్రాంతాలు తప్ప, హైదరాబాద్ సహా అన్ని జిల్లాలను గ్రీన్ జోన్లుగా నిర్ణయించామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కరోనా పరిస్థితులు, లాక్డౌన్ నిబంధనల సడలింపులపై మంత్రి మండలి సమావేశం ముగిసిన తరువాత ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. హాట్స్పాట్లు మినహా మితగా చోట్ల అన్ని దుకాణాలు తెరిచి వ్యాపారాలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో మాత్రం సరి, బేసి విధానం కింద దుకాణాలు తెరిచేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు ఇస్తారని వివరించారు. ఆటోలు, క్యాబ్‌లు, సెలూన్లు, ఆర్టీసీ బస్సులు నడపవచ్చని తెలిపారు. ఈ నెల 31 వరకు లాక్డౌన్, రాత్రివేళల్లో కర్ప్యూ కొనసాగుతాయని సృష్టం చేశారు. పరిస్థితులు మెరుగుపడి అందరూ ఆరోగ్యంతో ఉండాలని ఆకాక్షించారు. ఒకవేళ పరిస్థితి విషమిస్తే మరోసారి లాక్డౌన్ విధిస్తామని చెప్పారు.
కరోనా నియంత్రణ, లాక్డౌన్ మార్గదర్శకాలపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాం. వివిధ రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలు, విధివిధానాలు పరిశీలించాం. కరోనా నివారణ మందు రేపోమాపో వచ్చేలా లేదు. శాస్త్రవేత్తలు, నిపుణులు ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. కరోనాతో జీవించడం నేర్చుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటూ మనుగడ సాగించాలి. బంద్ పెట్టుకుని నెలల తరబడి కూర్చోలేం. హైదరాబాద్ కంటేయిన్మెంట్గా ప్రకటించిన ప్రాంతాల్లో 1452 కుటుంబాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో బయటి వారిని లోపలికి , లోపలి వారిని బయటకు అనుమతించం. వారికి మందులు, ఇతర సరుకులన్నీ ఇళ్ల వద్దకే అందిస్తాం అని తెలిపారు.






