Jogi Brothers: నకిలీ మద్యంకేసులో జోగి బ్రదర్స్‌కు సాక్ష్యాల ఉచ్చు!
“నేరం చేసి తప్పించుకోవడం వేరు.. ఆధారాలు లేకుండా దొరికిపోవడం వేరు.” కానీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముందు ఎంతటి వారైనా తలవంచక తప్పదు. సరిగ్గా ఇదే పరిస్థితి ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాములకు ఎదురవుతోంది. నకిలీ మద్యం వ్యవహారం బయటపడిన తొలినాళ్లలో “మాకు ఏ పాపం తెలియదు, అదంతా రాజకీయ కక్షసాధింపు చర్య” అంటూ గగ్గోలు పెట్టిన జోగి బ్రదర్స్, ఇప్పుడు సిట్ (SIT) బయటపెట్టిన పక్కా టెక్నికల్ ఎవిడెన్స్ తో మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపు సిట్ సేకరించిన సాంకేతిక ఆధారాలే. నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు (A1), జగన్మోహన్ రావు (A2) అసలు ఎవరో తమకు తెలియదని జోగి రమేశ్ పదేపదే చెప్పుకొచ్చారు. కానీ, కాల్ డేటా రికార్డ్స్ ఆ వాదనను పటాపంచలు చేశాయి. ఇబ్రహీంపట్నం కేంద్రంగానే ఈ నకిలీ మద్యం తయారీకి స్కెచ్ వేసినట్లు టవర్ లొకేషన్లు స్పష్టం చేస్తున్నాయి.
2025 ఏప్రిల్ 7, మే5, జూన్6, జూలై 17, 27, సెప్టెంబర్ 23 తేదీల్లో ప్రధాన నిందితులు, జోగి సోదరులు ఒకే టవర్ లొకేషన్ లో ఉన్నారు. ఇబ్రహీంపట్నం, పవిత్ర సంగమం, ఫెర్రీ, ఏఎన్ఆర్ బార్ పరిధిలో ఉండటం యాదృచ్ఛికం ఎలా అవుతుంది? అన్నదే సిట్ సూటి ప్రశ్న. నిందితులు ఒకే చోట కలుసుకుని కుట్రకు ప్రణాళికలు రచించారనడానికి ఇంతకంటే బలమైన సాక్ష్యం కోర్టుకు మరొకటి అవసరం లేదన్నది న్యాయ నిపుణుల మాట.
కేవలం లొకేషన్లే కాదు, వారి మధ్య ఉన్న కమ్యూనికేషన్ కూడా బయటపడింది. 2023 అక్టోబర్ నుంచి 2025 సెప్టెంబర్ మధ్య కాలంలో జోగి రాము, అద్దేపల్లి జనార్దన్ రావు మధ్య ఏకంగా 16 సార్లు ఇన్కమింగ్, అవుట్గోయింగ్ కాల్స్ నడిచాయి. ఒకరితో ఒకరికి సంబంధం లేకపోతే ఇన్నిసార్లు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? పైగా వారు ఫోన్లో మాట్లాడుకున్న సమయాల్లో మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా అదే లొకేషన్లో ఉండటం వారి ఉమ్మడి కుట్రను బలపరుస్తోంది.
రాజకీయ నాయకులు సాధారణంగా నేరాల్లో నేరుగా ఇన్వాల్వ్ అవ్వకుండా జాగ్రత్త పడతారు. కానీ, ఇక్కడ ఆర్థిక లావాదేవీలే జోగి బ్రదర్స్ మెడకు చుట్టుకున్నాయి. విడతల వారీగా సుమారు రూ. 45.06 లక్షల నగదు చేతులు మారినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. బ్యాంకు నుంచి డ్రా చేయడం, వెంటనే ఆ నగదును జోగి రాముకు అందజేయడం, దానికి ముందు లేదా తర్వాత ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం.. ఇవన్నీ ఒక గొలుసుకట్టులా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా, 2020లోనే అద్దేపల్లి జనార్దన్ రావు నుంచి జోగి రాముకు రూ. 2 వేలు యూపీఐ ద్వారా బదిలీ అయ్యాయి. అంటే, వీరి పరిచయం ఈనాటిది కాదని, పాతదేనని ఇది రుజువు చేస్తోంది. వీళ్లెవరో నాకు తెలీదు అని జోగి రమేశ్ చెప్పిన మాటలు అసత్యాలని తేలిపోయింది.
జోగి రమేశ్ ఆదేశాల మేరకే ఆయన సోదరుడు రాము నగదు స్వీకరించారని, మధ్యవర్తి రవి ద్వారా ముడిసరుకులకు చెల్లింపులు జరిపారని చార్జిషీట్లో పేర్కొనడం కేసు తీవ్రతను తెలియజేస్తోంది. సాధారణంగా సాక్షులు ప్లేటు ఫిరాయించవచ్చు, కానీ డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ అబద్ధం చెప్పవు. టవర్ లొకేషన్లు, బ్యాంకు స్టేట్మెంట్లు, కాల్ డేటా అనేవి కోర్టులో తిరుగులేని సాక్ష్యాలుగా నిలుస్తాయి.
మొత్తంగా చూస్తే, నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ ఇన్నాళ్లు అడ్డు పెట్టుకున్న రాజకీయ కక్ష అనే రక్షణ కవచం ఇప్పుడు పనికిరాకుండా పోయింది. సిట్ సేకరించిన ఆధారాలు వాళ్లను నేరంలో ప్రత్యక్ష భాగస్వాములుగా చూపిస్తున్నాయి. చట్టం నుంచి తప్పించుకోవడానికి ఉన్న అన్ని దారులు మూసుకుపోవడంతో, రానున్న రోజుల్లో జోగి సోదరులకు న్యాయపరమైన చిక్కులు తప్పవని స్పష్టమవుతోంది.






