TDP: భూ సమస్యలకు బ్రేక్… 2026లో ప్రజలకు కూటమి ప్రభుత్వ భారీ ఊరట
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అధికారంలో ఉన్న తెలుగుదేశం (TDP ) కూటమి ప్రభుత్వం కొత్త ఏడాది 2026ను ప్రజలకు ఉపశమనం కలిగించే ఏడాదిగా మార్చే దిశగా కీలక అడుగులు వేసింది. ముఖ్యంగా ఎన్నేళ్లుగా భూ వివాదాలు, నిషేధిత జాబితాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న భూయజమానులకు ఈ నిర్ణయాలు పెద్ద ఊరటగా మారాయి. 22ఎ జాబితా నుంచి ఐదు రకాల భూములను తొలగిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా, పరిపాలనపరంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నిర్ణయంతో పాటు మరో నాలుగు రకాల భూములపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని, అలాగే ప్రీ హోల్డ్ భూముల అంశంపై కూడా రెండు నెలల్లో స్పష్టత ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొత్త సంవత్సరం ప్రారంభమే భూ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు ఒక వరంగా మారిందని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం 2026 సంవత్సరాన్ని అధికారికంగా భూ నామ సంవత్సరంగా ప్రకటించడం వెనుక రైతులు, భూయజమానులకు న్యాయం చేయాలన్న ఆలోచన ఉందని స్పష్టం చేసింది.
రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ (Anagani Sathya Prasad) వివరాల ప్రకారం, 1955 జూన్ 18కు ముందు అసైన్ చేసిన కొన్ని భూములు, ప్రైవేట్ పట్టాలుగా ఉన్న భూములను 22ఎ జాబితా నుంచి తొలగించారు. దీంతో మాజీ, ప్రస్తుత సైనిక ఉద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములు కలిగిన వారికి నేరుగా లాభం చేకూరనుంది. అలాగే ఒక సర్వే నంబర్లో కొంత భూమి మాత్రమే సమస్యగా ఉన్నప్పటికీ మొత్తం భూమిని నిషేధిత జాబితాలో ఉంచడం వల్ల అనేక మంది నష్టపోయారని ప్రభుత్వం గుర్తించింది. ఇకపై అటువంటి భూములను సబ్ డివిజన్ చేసి సమస్య ఉన్న భాగాన్ని మాత్రమే నిషేధిత జాబితాలో ఉంచనున్నారు.
అయితే షరతులతో కూడిన పట్టా భూములు, సర్వీస్ ఇనామ్ భూములు, రీ సర్వే సమయంలో మళ్లీ 22ఎలో చేర్చిన చుక్కల భూములు వంటి అంశాలపై త్వరలో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. భూ యజమానులను ఇకపై అనవసరంగా తిప్పకూడదని రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పాత రెవెన్యూ రికార్డులు, అసైన్మెంట్ రిజిస్టర్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు వంటి ఎనిమిది రకాల డాక్యుమెంట్లలో ఏ ఒక్కటి ఉన్నా సంబంధిత భూమిని 22ఎ జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదిలా ఉండగా జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల 80 వేల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పాల్గొంటారని సమాచారం. అలాగే రిజిస్ట్రేషన్ల శాఖలో కీలక సంస్కరణలు తీసుకువస్తూ, నకిలీ , డబుల్ రిజిస్ట్రేషన్లపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు అధికారం ఇవ్వడం భూ అక్రమాలపై ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టంగా చూపిస్తోంది.






