బీఆర్ఎస్‌కు ఏమైంది..? ఎందుకీ పరిస్థితి వచ్చింది..?

తెలంగాణ రాజకీయాలు మొదలైందే తెలంగాణ రాష్ట్ర సమితితో..! ఆ పార్టీ ఉద్యమించడం వల్లే తెలంగాణ సాకారమైంది. ఉద్యమ పార్టీగా మొదలైన ప్రస్థానం ఆ తర్వాత రాజకీయ పార్టీగా రూపుదాల్చింది. అధికారాన్ని చేజిక్కించుకుంది. దేశరాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంది. కానీ ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్క ఓటమితో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. అసలు టీఆర్ఎస్ కు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది..?
ఎన్నికలంటే టీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుంది. ఎన్నికలను ఎదుర్కోవడంలో ఆ పార్టీ ఎప్పుడూ రెడీగా ఉండేది. కానీ ఈసారి మాత్రం పూర్తి డీలాపడింది. లోక్ సభ ఎన్నికలకు ఇప్పటికే ఆ పార్టీ 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. కానీ ఒక్క చోట కూడా లీడర్లు కనిపించడం లేదు. కేడర్ లో కూడా జోష్ లేదు. నేతలు కూడా కేడర్ తో సమావేశాలు నిర్వహించలేదు. ఇక ప్రచారం మాట దేవుడెరుగు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి బయటపడాలంటే కనీసం 8-10 స్థానాలు గెలవాలని టార్గెట్ గా పెట్టుకుంది ఆ పార్టీ. అయితే దానికి తగ్గ ఉత్సాహం మాత్రం పార్టీలో కనిపించడం లేదు. బీఎస్పీతో పెట్టుకున్న పొత్తు బెడిసికొట్టింది.
2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. 14 ఏళ్లు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడింది. తెలంగాణను సాకారం చేసింది. ఆ తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉంది. అప్పటివరకూ ఆ పార్టీకి తిరుగులేదు. మూడోసారి కూడా గెలిచి దేశంలో చక్రం తిప్పాలనుకున్నారు కేసీఆర్. అందుకోసం పార్టీని కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక, ఒడిశా, ఏపీ లాంటి రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు స్కెచ్ వేశారు. కొన్ని రాష్ట్రాల్లో కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. బహిరంగసభలు పెట్టారు. తెలంగాణ అసెంబ్లీలో గెలిచిన వెంటనే దేశం మొత్తం దున్నేయాలనుకున్నారు. కానీ అన్నీ అనుకున్నట్టు జరగవు కదా.
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ పరిస్థితి సమూలంగా మారిపోయింది. కీలక నేతలంతా పార్టీని వీడుతున్నారు. ఇప్పటివరకూ ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు పలువురు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. రేపోమాపో వాళ్లు కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఏకంగా బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు కవిత కేసు మళ్లీ మొదటికొచ్చింది. ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. కవితను అరెస్టు చేస్తే తెలంగాణలో అగ్గి రాజేస్తాం అని గతంలో బీఆర్ఎస్ నేతలు ప్రగల్బాలు పలికారు. ఇప్పుడు చడీచప్పుడు లేకుండా ఉండిపోయారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల పైన కొత్త కొత్త కేసులు నమోదవుతున్నాయి. భూకబ్జాలు, లిక్కర్ స్కాంలు, ధరణి అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ లు.. లాంటివి వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలు ఈ కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్ ఎప్పుడూ చూడలేదు. అందుకే పార్టీ కేడర్ మొత్తం పూర్తిగా డీలా పడిపోయింది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే పార్టీ ఉంటుందా.. ఉండదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.