హైదరాబాద్ లో యాక్స్‌ట్రియా కేంద్రం విస్తరణ

జీవశాస్త్ర రంగంలోని సంస్థలకు క్లౌడ్ సాఫ్ట్‌వేర్, డేటా అనలిటిక్స్ సేవలను అందించే యాక్స్‌ట్రియా హైదరాబాద్‌లోని తన ఇన్నోవేషన్ కేంద్రాన్ని విస్తరించింది. అమెరికాకు చెందిన ఈ సంస్థకు ఇది తొమ్మిదో గ్లోబల్ ఇన్నోవేషన్ కేంద్రం. కృత్రిమ మేధ, జనరేటివ్ ఏఐ ఆధారిత సేవలను అందించడం ద్వారా లైఫ్ సైన్సెస్ సంస్థలకు మెరుగైన ఫలితాలు అందించేందుకు హైదరాబాద్ కేంద్రం తోడ్పడనుంది. దాదాపు 76వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం సంస్థకు దేశంలో అతి పెద్దది. కార్యాలయాన్ని విస్తరించడం ద్వారా ఇక్కడి నిపుణులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు వీలవుతుందని సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ జస్విందర్ చద్దా అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలోని సంస్థల ఆవిష్కరణలకు ఇది తోడ్పాటు అందిస్తుందన్నారు. డేటా సైన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటా ఇంజినీరింగ్ నిపుణులను నియమించుకోనున్నట్లు తెలిపారు. నోయిడా, పుణె, హైదరాబాద్‌లలో సంస్థను విస్తరించిన నేపథ్యంలో, రానున్న 9`12 నెలల్లో 800 మంది నిపుణులను తీసుకునే ప్రణాళికలున్నాయని వెల్లడించారు.