‘జెండా పండుగ’తో జనంలోకి కవిత..!
తెలంగాణ రాజకీయ యవనికపై సత్తా చాటేందుకు ఇటీవలే పార్టీ ప్రకటించారు కల్వకుంట్ల కవిత. ‘తెలంగాణ రక్షణ సేన‘- టీఆర్ఎస్ పేరిట పార్టీ అనౌన్స్ చేసిన ఆమె, ఇప్పుడు క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సమరశంఖం పూరించారు. రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు జెండా పండుగ నిర్వహించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. కేవలం రాజకీయ పార్టీగా మాత్రమే కాకుండా, ఒక బలమైన సామాజిక ఉద్యమ శక్తిగా టీఆర్ఎస్ తన ఉనికిని చాటుకునేలా కవిత యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు.
తెలంగాణ రక్షణ సేన భావజాలాన్ని ప్రతి గడపకూ చేరవేయాలనే లక్ష్యంతో మే 20 నుండి జూన్ 20 వరకు జెండా పండుగలు నిర్వహించాలని కవిత నిర్ణయించారు. రాజధాని హైదరాబాద్ మొదలుకొని, జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు, మండలాలు, మారుమూల గ్రామాల వరకు పార్టీ జెండాను ఎగురవేయాలని అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. ఈ నెల రోజుల కాలంలో పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల్లో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ పార్టీ జెండా కింద అందరినీ ఏకం చేయడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించిన పార్టీ విధానాలను, ముఖ్యంగా ‘పాంచజన్య’ సిద్ధాంతాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సంక్షేమం చుట్టూ అల్లిన ఈ సిద్ధాంతాలను సామాన్యులకు అర్థమయ్యేలా వివరించడం ద్వారా పార్టీకి ఒక పటిష్టమైన కేడర్‌ను నిర్మించాలని ఆమె భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ జెండా పండుగ కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా, ఒక క్రియాశీలక పోరాట వేదికగా మారాలని కవిత ఆశిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో నెలకొన్న ప్రధాన సమస్యలతో పాటు, ప్రతి గ్రామంలోనూ ఉండే స్థానిక సమస్యల పట్ల పార్టీ శ్రేణులు స్పందించాలని కవిత ఆదేశించారు. ఎక్కడికక్కడ ప్రజల గళమై నిలబడాలని, అవసరమైన చోట ప్రజా ఉద్యమాలు చేపట్టాలని ఆమె సూచించారు. తద్వారా పార్టీకి పోరాట యోధుల సేన అనే ముద్రను వేయాలని ఆమె వ్యూహరచన చేస్తున్నారు.
తెలంగాణ రక్షణ సేన కేవలం ఒక రాజకీయ ప్రత్యామ్నాయం మాత్రమే కాకుండా, బాధ్యతాయుతమైన పౌర సమాజాన్ని నిర్మించే వేదికగా ఉండాలని కవిత ఆకాంక్షిస్తున్నారు. సమాజంలోని ప్రతి వర్గాన్ని.. అంటే రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు… ఇలా అందరూ జెండా పండుగలో భాగస్వాములను చేయాలని పార్టీ భావిస్తోంది. అంకితభావం కలిగిన చురుకైన కార్యకర్తలను గుర్తించి, వారిని సామాజిక మార్పు కోసం సిద్ధం చేయడమే ఈ నెల రోజుల ఉత్సవం వెనుక ఉన్న పరమార్థంగా కనిపిస్తోంది.
రాజకీయ చైతన్యం కలిగిన ఒక బలమైన జన సమూహాన్ని నిర్మించడం ద్వారా, భవిష్యత్తులో తెలంగాణ గడ్డపై వచ్చే ఏ సమస్యకైనా తక్షణమే స్పందించేలా టీఆర్ఎస్ కార్యకర్తలను తీర్చిదిద్దబోతున్నారు. ప్రజల కోసం – ప్రజల మధ్యన అనే నినాదంతో కవిత ముందుకు సాగుతున్నారు. మే 20 నుండి ప్రారంభం కానున్న ఈ జెండా పండుగలు తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీయనున్నాయి. టీఆర్ఎస్ పేరిట పార్టీని ప్రకటించిన కవిత, ఇప్పుడు ఈ నెల రోజుల కార్యక్రమంతో పార్టీని సంస్థాగతంగా ఎంత బలోపేతం చేస్తారో చూడాలి. గ్రామ స్థాయి నుండి పార్టీని నిర్మిస్తూ, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించేందుకు ఆమె వేస్తున్న ఈ అడుగులు భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి






