Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు, వైసీపీకి సంబంధం లేదా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. వైసీపీ (YCP) అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడిన బోరుగడ్డ అనిల్ కుమార్ (Borugadda Anil Kumar) వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఒకప్పుడు ఎవరినైతే వైసీపీ తమ ఆయుధంగా వాడుకుందని ఆరోపణలు వచ్చాయో, ఇప్పుడు ఆ వ్యక్తినే ‘మావాడు కాదు’ అని చెప్పేసింది. ఇంతకూ బోరుగడ్డ అనిల్ కుమార్ కు, తమ పార్టీకి సంబంధం లేదని వైసీపీ ఎందుకు చెప్పిందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ అయి, ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన బోరుగడ్డ అనిల్, తాజాగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలే ఇప్పుడు వైసీపీలో కలకలం రేపాయి. “నేను జైలు నుంచి బయటకు రావడానికి కారణం జగన్ మోహన్ రెడ్డే. ఆయనే నాకు అండగా నిలిచారు. ఆయన కోసం నేను ప్రాణాలిస్తా..” అంటూ అనిల్ ఎమోషనల్ అయ్యారు. మామూలుగా అయితే ఇది ఒక కార్యకర్త అభిమానంలా కనిపించేది. కానీ, బోరుగడ్డ అనిల్ నేపథ్యం, గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, రౌడీ షీటర్ అనే ముద్ర ఉండటంతో.. ఈ వ్యాఖ్యలు వైసీపీకి రాజకీయంగా తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయి. “చూశారా.. ఒక రౌడీ షీటర్‌ను మాజీ సీఎం జగన్ ఎలా కాపాడుతున్నారో.. స్వయంగా ఆ రౌడీనే ఒప్పుకున్నాడు” అంటూ టీడీపీ, జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టాయి. ఇది వైసీపీ నాయకత్వానికి మింగుడు పడలేదు.
అనిల్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్న తరుణంలో, వైసీపీ అధిష్టానం వెంటనే అప్రమత్తమైంది. పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా, ముఖ్య నేతల ద్వారా ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. “బోరుగడ్డ అనిల్ కుమార్‌కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అతను మా పార్టీ సభ్యుడు కాదు, మా నాయకుడు కాదు” అని తేల్చి చెప్పింది. నిజానికి, 2019-2024 మధ్య కాలంలో బోరుగడ్డ అనిల్.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై అత్యంత జుగుప్సాకరమైన భాషలో విమర్శలు చేసినప్పుడు వైసీపీ ఎప్పుడూ ఆయన్ను వారించలేదు సరికదా, పరోక్షంగా ప్రోత్సహించిందనే విమర్శలు ఉన్నాయి.
అప్పుడు అనిల్ కుమార్ వెంట ఉన్న వైసీపీ, ఇప్పుడెందుకు దూరం పెడుతోందనేది ఆసక్తి రేపుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ ఆత్మరక్షణలో పడింది. ఇలాంటి సమయంలో క్రిమినల్ రికార్డులున్న వ్యక్తులు, రౌడీ షీటర్లు తమ పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితులు అని చెప్పుకోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుంది. జగన్ ఇమేజ్ను ఇది మరింత డ్యామేజ్ చేస్తుందని పార్టీ భావించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టేవారిపై, రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ సమయంలో బోరుగడ్డతో సంబంధాలు కొనసాగిస్తే, పార్టీ మొత్తం న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. రాజకీయాల్లో అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం, అవసరం తీరాక లేదా ఆ వ్యక్తి భారంగా మారినప్పుడు వదిలించుకోవడం సహజం. బోరుగడ్డ అనిల్ ఎపిసోడ్ దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణగా విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ప్రత్యర్థులను తిట్టడానికి ఆయన ఉపయోగపడ్డాడు, కానీ ఇప్పుడు ఆయనతో ఉంటే పార్టీకే నష్టం అని గ్రహించి పక్కన పెట్టేసారు.
బోరుగడ్డ అనిల్ తాజా ఇంటర్వ్యూలు వైసీపీకి మేలు చేయడం కన్నా, కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టాయి. తాను జగన్ మనిషినని అనిల్ ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా, పార్టీ మాత్రం ఆయన్ను అధికారికంగా నిరాకరించడం అనిల్ కుమార్‌కు వ్యక్తిగతంగా పెద్ద షాక్. ఇది భవిష్యత్తులో వైసీపీ కోసం పనిచేసే ఇతర సోషల్ మీడియా కార్యకర్తలకు, అతిగా స్పందించే వారికి ఒక హెచ్చరిక లాంటిదని చెప్పవచ్చు. పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోతే, అధికారం పోయాక అండగా నిలబడతాయన్న గ్యారెంటీ లేదని ఈ ఘటన నిరూపిస్తోంది.






