Upputuri Chinaramulu: నిత్య అన్నదాత.. ఉప్పుటూరి చినరాములు సేవా ప్రస్థానం.. సీఎం ప్రశంస
అమరావతి: గుంటూరు జిల్లాలోని పుల్లడిగుంట ఓ చిన్న పల్లెటూరు. కానీ ఈ ఊరి పేరు ఇప్పుడు ఒక గొప్ప సేవా కార్యక్రమానికి చిరునామాగా నిలుస్తోంది. ఆ సేవకు మూలం… ఆప్యాయత, ఆశీర్వాదం!
ప్రేమతో వడ్డింపు..
గ్రామంలో ఎందరో నిరుపేదలు, కూలీ నాలీ చేసుకునేవారు, వృద్ధులు… కడుపునిండా తిండి దొరకడం కూడా కష్టంగా ఉండే మనుషులు. వారి ఆకలి కేకలను విన్నారు ఉప్పుటూరి చినరాములు. తన సతీమణి, దివంగత మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఉప్పుటూరి సీతామహాలక్ష్మి జ్ఞాపకార్థం ఆయన స్థాపించినదే ఉప్పుటూరి చినరాములు సేవా ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా గ్రామంలో ఒక ‘అన్న క్యాంటీన్’ మొదలైంది. ఇది కేవలం భోజనశాల కాదు, పేద ప్రజల ఆకలిని తీర్చే అమ్మ హస్తం లాంటిది. రోజూ వందల మందికి, ఉదయం-సాయంత్రం తేడా లేకుండా, రుచికరమైన, శుభ్రమైన భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నారు. చినరాములు గారికి ఇది కేవలం సామాజిక సేవ కాదు, ఆయన సతీమణి పట్ల ఉన్న ప్రేమను, ఆమె ఆశయాన్ని నిరంతరం సజీవంగా ఉంచే ఒక పవిత్ర యజ్ఞం.
విదేశాల నుంచి అండ..
ఈ మహత్కార్యానికి చినరాములుకు అండగా నిలిచారు ఆయన కుమారుడు, ఎన్నారై అయిన రామ్ చౌదరి. విదేశాల్లో ఉన్నా, మాతృభూమిపై మమకారాన్ని, పేదలపై కరుణను మరిచిపోని రామ్ చౌదరి, తన తండ్రి చేస్తున్న సేవకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు. తండ్రీ కొడుకుల ఈ బంధం, సేవారూపంలో పేదలకు ఒక వరంగా మారింది.
ముఖ్యమంత్రి ప్రశంస
నిస్వార్థమైన ఈ అన్నదాన కార్యక్రమం గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తెలిసింది. డిసెంబర్ 10న ఆయన చినరాములుకు ప్రత్యేకంగా తన కార్యాలయానికి ఆహ్వానించారు. చిన్న గ్రామంలో నిరాడంబరంగా మొదలైన ఈ గొప్ప సేవా కార్యక్రమం గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. చినరాములు తమ సేవ వెనుక ఉన్న ప్రేరణను, తమ కుమారుడు రామ్ చౌదరి ఆర్థిక సహకారాన్ని వివరించారు. సేవా స్ఫూర్తిని, దాతృత్వాన్ని మెచ్చుకున్న ముఖ్యమంత్రి, చినరాములుని మనస్ఫూర్తిగా అభినందించారు. “మీరు చేస్తున్నది కేవలం అన్నదానం కాదు, ఎందరికో జీవితాన్ని ఇస్తున్నారు. అదే స్ఫూర్తితో నిలవండి, పేదలకు అండగా ఉండండి” అని సీఎం ఆయన్ని కోరారు.






