AP Politics: ఏపీ లో రాజ్యసభ రేసు.. కూటమిలో టికెట్‌పై భారీ పోటీ
ఏపీలో వచ్చే ఏడాది మే–జూన్ నెలల మధ్య జరగనున్న రాజ్యసభ ఎన్నికలు రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చర్చకు దారితీశాయి. ఈసారి నాలుగు స్థానాలు ఖాళీ కానుండగా, ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఈ నాలుగింటినీ టీడీపీ (TDP) కూటమి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందులో ఇద్దరు టీడీపీ, ఇద్దరు బీజేపీ (BJP) , మిగిలిన ఏడుగురు వైఎస్సార్సీపీకి (YCP) చెందినవారు.
వచ్చే జూన్ 21తో వైసీపీ నాయకులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి (Alla Ayodhya Ramireddy), పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandrabose), పరిమళ్ నత్వాని (Parimal Nathwani) పదవీకాలం ముగుస్తుంది. అలాగే గత ఏడాది జరిగిన ఉపఎన్నికలలో టీడీపీ తరఫున గెలిచిన సానా సతీష్ (Sana Satish) పదవీకాలం కూడా అదే తేదీన పూర్తవుతుంది. ఈ కారణంగా ఎన్నికలు జూన్‌కు ముందే జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు — టీడీపీ, బీజేపీ, జనసేన (Janasena) కలిసి ఉండటంతో నాలుగు స్థానాల పంపకం ఎలా జరుగుతుందన్న ప్రశ్న మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు ఉపఎన్నికల్లో టీడీపీ, బీజేపీ చెరో రెండు సీట్లు పొందగా, జనసేనకు ఇంకా అవకాశం రాలేదు. దీంతో ఈసారి జనసేనకు ఒక సీటు కేటాయించే అవకాశంపై చర్చ ఎక్కువైంది. గతంలో నాగబాబు (Naga Babu)కు అవకాశం వస్తుందని అనుకున్నా, బీజేపీ ఆ సమయంలో ఒత్తిడి తీసుకోవడంతో జనసేన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కాబట్టి ఈసారి బీజేపీ బదులుగా జనసేనకు అవకాశం ఇస్తారా? అనేది ప్రధాన చర్చాంశంగా మారింది.
టీడీపీకి వచ్చిన సీట్లపై కూడా పార్టీ లోపలే పెద్ద పోటీ కనిపిస్తోంది. కేవలం ఏడాదిన్నరలోనే పదవీకాలం ముగిసే సానా సతీష్‌కు మళ్లీ అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన లోకేశ్ (Nara Lokesh)కు అత్యంత సన్నిహితుడు కావడం, ఢిల్లీలోని కేంద్ర నాయకత్వం వద్ద మంచి పరిచయాలు ఉండటం ఈ అవకాశాలను పెంచుతున్నాయని అంటున్నారు. గతంలో ఈ బాధ్యతలను నిర్వర్తించిన కంభంపాటి రామ్మోహనరావు (Kambhampati Rammohan Rao) కూడా ఈసారి రాజ్యసభకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారముంది.
ఇక టీడీపీకి చెందిన గల్లా జయదేవ్ (Galla Jayadev), పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన దేవినేని ఉమా (Devineni Uma), పిఠాపురం వర్మ (Pithapuram Varma), జవహర్ (Jawahar)తో పాటు సీనియర్ నాయకులు వర్ల రామయ్య (Varla Ramaiah), యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) వంటి పలువురు నేతలు కూడా రాజ్యసభ టికెట్ కోసం ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోసం సీటు వదులుకున్న పిఠాపురం వర్మకు పార్టీ ఏదైనా ప్రత్యామ్నాయం ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది.
అయితే, ఆశావహులలో ఎక్కువ మంది అగ్రవర్ణాలకు చెందినవారే ఉండటంతో, ఈసారి సామాజిక సమతుల్యాన్ని దృష్టిలో ఉంచి బీసీ, ఎస్సీ వర్గాలకూ అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో రాబోయే రాజ్యసభ ఎన్నికలు టీడీపీ కూటమిలో భారీ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
-Bhuvana






