ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్లు, డీజీపీకి రఘురామ ఫిర్యాదు..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు(RaghuRama Krishnam raju) ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై ఓ సంచలన అడుగు వేసారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల నుంచి వస్తున్న మితిమీరిన శబ్దాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, శబ్ద కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ ఆయన రాష్ట్ర డీజీపీకి(DGP) లేఖ రాశారు. ప్రార్థనా స్థలాలలో లౌడ్ స్పీకర్ల కారణంగా ఏర్పడుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని రఘురామ కోరారు.
ఇవి కూడా చదవండి
శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలతో పాటు కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఆయన డీజీపీని కోరారు. అనుమతించిన స్థాయి కంటే ఎక్కువ శబ్దంతో లౌడ్ స్పీకర్లను వాడటం చట్టరీత్యా నేరమని ఆయన గుర్తు చేశారు. ప్రార్థనా స్థలాల్లో తెల్లవారుజాము నుంచే లౌడ్ స్పీకర్ల వాడకం వల్ల వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు మరియు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రఘురామ తన లేఖలో పేర్కొన్నారు.
శబ్ద కాలుష్యం కేవలం అసౌకర్యాన్నే కాకుండా, ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలను అతిక్రమించే వారిపై రాజీ లేని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను రఘురామ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వాడకంపై ఉన్న పరిమితులను పోలీసులు ఖచ్చితంగా అమలు చేసేలా చూడాలని కోరారు. ప్రతి ప్రార్థనా స్థలంలో శబ్ద తీవ్రతను కొలిచే పరికరాలను తనిఖీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే లౌడ్ స్పీకర్లను తొలగించడంతో పాటు భారీ జరిమానాలు విధించాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి






