పెద్దిపై ఆ వివాదం ఎఫెక్ట్ పడుతుందా?
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల అద్దె విధానంపై కొనసాగుతున్న వివాదం ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రెంటల్ సిస్టమ్ బదులుగా పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబిటర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మొదట నిజాం ప్రాంతంలో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి కూడా విస్తరించింది. తాజాగా నైజాం ఎగ్జిబిటర్లు సమావేశమై పర్సంటేజ్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శిరీష్ రెడ్డి(Shirish Reddy), ఈ పోరాటం ఏ నిర్మాతకు లేదా ఏ సినిమాకు వ్యతిరేకంగా కాదని, థియేటర్ వ్యవస్థ మనుగడ కోసమే జరుగుతోందని స్పష్టం చేశారు.
శిరీష్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల వెలుపల ఇప్పటికే పర్సంటేజ్ విధానం విజయవంతంగా అమలవుతోందని, కానీ పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న తెలుగు సినిమాలు మాత్రం తమ స్వస్థలమైన తెలుగు రాష్ట్రాల్లో సరైన ఆదాయం అందించలేకపోతున్నాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న, మధ్యస్థాయి థియేటర్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, ఈ సమస్యకు పరిష్కారంగా పర్సంటేజ్ విధానమే సరైన మార్గమని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 14న ఆంధ్ర ప్రాంత ఎగ్జిబిటర్లు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఇక ఈ వివాదం ప్రభావం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది(Peddi)పై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 29 నుంచి థియేటర్ల మూసివేతకు కూడా ఎగ్జిబిటర్లు హెచ్చరికలు జారీ చేయడంతో పరిశ్రమలో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్‌కు పెద్ది కీలక సినిమా కావడంతో, రిలీజ్‌కు ముందే ఈ సమస్యకు పరిష్కారం లభించాలని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.






