Pawan Kalyan: కూటమి పాలనకు కొత్త దిశ.. గ్రామాభివృద్ధిపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన వ్యూహం..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం పూర్తయ్యే లోపే అనేక మార్పులు చోటుచేసుకున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. అధికారుల మధ్య, శాఖల మధ్య ఉన్న మంచి సమన్వయమే ఈ పురోగతికి కారణమని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరి (Mangalagiri) లోని సికె కాన్వెన్షన్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో జరిగిన ‘మాట–మంతి’ కార్యక్రమంలో పవన్ పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
గ్రామాలు దేశానికి పునాది అన్న భావనతోనే పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్నానని పవన్ తెలిపారు. తాగునీటి సమస్యల నుంచి సాగునీటి అవసరాలు, రహదారులు, పారిశుధ్యం, ఉపాధి హామీ, పాఠశాల విద్య, నిరుద్యోగం వరకు ప్రతి అంశంపై అధికారులంతా సమగ్రంగా ఆలోచించాలని సూచించారు. పల్లెల్లో సమస్యలు పరిష్కారమైతేనే రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ శాఖలో తీసుకున్న నిర్ణయాలన్నీ అధికారుల అనుభవం ,సూచనల ఆధారంగానే అమలు చేశామని పవన్ చెప్పారు. స్వయంగా సమీక్షలు నిర్వహించిన తరువాత పలు సంస్కరణలు అవసరమని తెలిసి, వాటిని అమలులోకి తెచ్చినట్టు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో ఔట్సోర్సింగ్ సిబ్బందితో కలిపి దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరిలో పదివేల మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేసిందని పవన్ వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ సిఫార్సులు లేకుండా పనిచేసే విధానాన్ని ప్రారంభించామని పవన్ స్పష్టం చేశారు. గత ఏడాదిన్నరలో పాలనలో ఇంత పెద్ద ఎత్తున రిఫార్మ్స్ అమలు చేయడం అరుదని ఆయన తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల హోదాను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా మార్చడం, రాష్ట్రవ్యాప్తంగా 77 కొత్త డీడీఓ కార్యాలయాలను ప్రారంభించడం, కెపాసిటీ బిల్డింగ్‌లో విస్తృతంగా శిక్షణలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఈ సంస్కరణల్లో భాగమని వివరించారు. ఈ చర్యలతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టగలిగామని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజలకే ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం కనీసం మరుసటి 15 సంవత్సరాలపాటు సుస్థిరంగా కొనసాగుతుందని, ఆ దిశగా అధికారులు కూడా తమ పనితీరును మార్చుకోవాలని ఆయన సూచించారు. గ్రామాభివృద్ధి ,పారదర్శక పాలనపై ప్రభుత్వం కొనసాగిస్తున్న దృష్టి రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతుందని పవన్ పేర్కొన్నారు.






