AP: ఏపీలో ఎన్డీఏ కూటమి పాలనకు ఏడాది

ఆంధ్రప్రదేశ్‌లో గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ స్థానాలను చేజిక్కించుకుని పాలనను చేపట్టిన ఎన్టీఎ కూటమి (NDA Alliance) పాలనకు జూన్ 12న ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఏడాది పాలన వేడుకలను కూటమి ప్రభుత్వం నిర్వహించింది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 175 స్థానాలకు 164 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది.
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరంగా వేసిన అడుగులు.. తీసుకున్న నిర్ణయాలు ఆసక్తిగా ఉంటాయి. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు తన విజన్‌ను మరోసారి నిలబెట్టుకున్నారు. గతంలో తనకు ఉన్న ఇమేజ్.. తర్వాత కాలంలో నిలబెట్టుకున్నారు. అయితే.. 2024 ఎన్నికల సమయానికి ప్రజలు సంక్షేమకార్యక్రమాలపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ హయాంలో ఇచ్చిన పథకాలతో ప్రజలు దాదాపు వాటిపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో చంద్రబాబు కూడా సంక్షేమ పథకాల కొనసాగింపునకు అనుకూలంగా తన విజన్ ను మార్చుకున్నారు. మరోవైపు అభివృద్ధికి కూడా అవసరమైన చర్యలను చేపట్టారు. సంక్షేమం-అభివృద్ధి పాలనకు తన విజన్‌ను జోడిరచి తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టాలపైకి ఎక్కించారు. దీంతో ఏడాది పాలనలో విజన్‌కు కూడా సమతూకమైన స్థానం.. వేదిక దక్కింది. ముఖ్యంగా మూడు అంశాల్లో చంద్రబాబు దూకుడుగా విజన్‌ను తిరిగి ప్రారంభించారనే చెప్పాలి. వైకాపా పాలనలో దగాపడ్డ మధ్యతరగతి, అట్టడుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా.. అన్ని వర్గాల జీవనాన్ని గుణాత్మకంగా మార్చే బృహత్తర లక్ష్యంతో విలక్షణ ప్రజా సంక్షేమపాలనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
సంకీర్ణ ప్రభుత్వాలంటే సాధారణంగా కలహాలు, రాజీల మాటలు అనివార్యంగా కనిపిస్తాయి. కానీ, ఈసారి అలాంటి దృశ్యాలు లేకుండా మిత్రపక్షాలు సమన్వయంతో ముందుకు సాగుతున్న తీరు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. ఈ కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయ్యే సరికి, వారు ఎంత సమగ్రంగా కలిసి పనిచేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య ఏర్పడిన స్నేహబంధం ఈ ప్రభుత్వం స్థిరంగా కొనసాగడానికి పెద్ద బలంగా మారింది. చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ జనసేన తరఫున లోకేశ్ పోరాటాన్ని గుర్తించి, పార్టీల ఐక్యతపై నమ్మకంతో ముందుకు వచ్చారు. రాజమండ్రి జైలు వద్ద ఇచ్చిన ప్రకటనతో ప్రారంభమైన మైత్రి, ఆ తర్వాత బీజేపీతో జరిగిన చర్చలతో బలంగా మారింది. ఎన్నికల అనంతరం పదవుల పంపిణీలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ అనుభవంతో మిత్రపక్షాల అభిప్రాయాలను గౌరవిస్తూ ముందడుగు వేస్తున్నారు. బీజేపీ, జనసేన పార్టీలు గెలిచిన స్థానాల ఆధారంగా నామినేటెడ్, మంత్రివర్గ, రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలపై పటిష్టమైన సమన్వయంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది మిత్రధర్మానికి నిదర్శనంగా నిలిచింది. దాంతో ఆ పార్టీలు ఎటువంటి అసంతృప్తితోనూ ఉండకుండా ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి.
అయితే కొన్ని అసహజతలు ఎక్కడోకక్కడ కనిపించకుండా లేవు. టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ‘వారు కాదు మేమే ఎక్కువ’ అనే తర్కంతో వాదనలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఒక వ్యత్యాసమైన దృక్పథంగా ఉన్నా పెద్దగా సమస్యలుగా మారకపోవడం విశేషం. కానీ బీజేపీ శ్రేణులు మాత్రం కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో అంతగా చొరవ చూపడం లేదు. దీంతో ఆ పార్టీ తీరుపై మిగతా మిత్రపక్షాల్లో కొంత ఆందోళన నెలకొంటోంది. అయినా, ఈ మూడు పార్టీల కలయికపై ప్రజల్లో ఉన్న విశ్వాసం, నాయకుల స్థాయిలో ఉన్న పరస్పర నమ్మకం నేపథ్యంలో ఈ కూటమి పాలన అంతులేని స్థిరత దిశగా సాగుతుందన్న ఆశలు బలంగా కనిపిస్తున్నాయి.
ఏడాది కాలంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలుతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతూ వచ్చింది.2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు చంద్రబాబు నాయుడు సర్కార్ ప్రయత్నాలు వేగవంతం చేసింది. తల్లికి వందనం సహా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అమరావతి పనులు ప్రారంభం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా పెన్షన్లు ఇచ్చే విషయంలో దూకుడుగానే వెళ్ళింది చంద్రబాబునాయుడు సర్కార్. త్వరలోనే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. మరోవైపు ఈ ఏడాదిలో.. మంత్రులు ఎంతవరకు ప్రచారంలో ముందున్నారు అనేది చెప్పలేని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని నడపడం అనేది సవాల్ తో కూడుకున్న విషయం. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కూడా అత్యంత కష్టమైన అంశంగానే చెప్పాలి.
అలాంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అయితే ఏడాది పాలన విషయంలో మంత్రులు మాత్రం ప్రచారం చేసే విషయంలో వెనుకబడ్డారనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. కనీసం చాలా మంది మంత్రులు మీడియా ముందుకు కూడా రాలేకపోతున్నారనే అభిప్రాయాలు సైతం వినపడుతున్నాయి. తమ తమ నియోజకవర్గాల్లో సైతం ప్రచార కార్యక్రమాలను నిర్వహించే విషయంలో వెనుకబడి ఉంటున్నారు. విపక్షాలపై విమర్శలు చేసే సమయంలో కూడా వెనుక పడుతున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా వైసిపి చేస్తున్న కొన్ని ప్రచారాల విషయంలో దూకుడుగా ఉండలేకపోతున్నారు. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు క్లాస్ పీకిన సరే మంత్రుల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదనేది టిడిపి కార్యకర్తలుతో పాటుగా కూటమి పార్టీల కార్యకర్తల ఆవేదన. మరి ఇప్పటికైనా మంత్రుల వ్యవహార శైలిలో మార్పు వస్తుందా లేదా అనేది చూడాలి.
ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మంత్రులు కూడా తమదైన శైలిలో సీఎం చంద్రబాబుకి గిఫ్టులు ఇచ్చారు. ఇవి సాధారణ బహుమతులు కాకుండా వారి పనితీరు, కృషిని ప్రతిబింబించే నివేదికలు. చంద్రబాబు పనిచేసే తీరు కఠినమైనది. ఆయన నుంచి మెప్పు పొందాలంటే పని ఫలితాలను చూపించాలి. అదే విషయాన్ని గుర్తించిన మంత్రులు గత ఏడాది కాలంలో తమ శాఖలలో చేసిన అభివృద్ధి పనులను ఒక దస్తావేజుగా తయారుచేసి సీఎం కార్యాలయానికి పంపించారు. ‘‘మీ మార్గదర్శకత్వాన్ని అనుసరించాం. మీరు చూపిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేశాం’’ అనే సందేశంతో ప్రతి మంత్రివర్గ సభ్యుడు తన శాఖకు సంబంధించిన పూర్తి వివరాలను పంపాడు. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, రాష్ట్ర ఖజానా నుంచి విడుదలైన బడ్జెట్‌ను ఏ రంగాల్లో వినియోగించారో వివరించబడిరది.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ‘‘మేము మాటలతో కాకుండా పనులతో ముందుకు సాగుతున్నాం. ముఖ్యమంత్రి మాటలు వినడమే కాదు, ఆయనతో కలిసి పనిచేస్తున్నాం. అందుకే ఆయన్ను మేము మా పనితీరు నివేదికల ద్వారా అభినందించాం,’’ అని చెప్పారు. ప్రజల ఆశలు పెరిగిన ఈ దశలో, ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో మంత్రులకు జాగ్రత్తగా ఉండాలని, సమర్థత చూపించాలని సూచిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం మంత్రుల పనితీరు మీద ఓ సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, ఎవరి వృధా తాపీని సహించబోనని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో మంత్రులు తమ పనితీరును రుజువు చేస్తూ పిడిఎఫ్ మరియు ప్రింటెడ్ కాపీలుగా నివేదికలు సిద్ధం చేసి పంపించారు. ఇప్పటికే 4.0 ప్రభుత్వం నుంచి ప్రజలు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ నెత్తిన భారం అధిగమించాలంటే మంత్రులు మరింత సమర్థంగా పని చేయాల్సిన అవసరం ఉందని సీఎం చెబుతున్నారు. ఇప్పుడు ఈ గిఫ్ట్‌ల ద్వారా చంద్రబాబుకు తమ శాఖల పనితీరును వారు తెలియజేశారు.
కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజల అభిప్రాయాలను పలు సర్వేలు వెల్లడిరచాయి. రాష్ట్రంలో సుమారు 70 శాతం మంది ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు ఈ సర్వేల్లో పేర్కొనడం విశేషం. దీంతో, ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉన్నదన్న విషయం స్పష్టమవుతుంది. ఇంకా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇటీవలి కాలంలో జరుగుతున్న మీడియా సమావేశాల్లో, పార్టీ సమావేశాల్లో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, ప్రజలు తీవ్రంగా అసంతృప్తిగా ఉన్నారని పదే పదే చెబుతూ వస్తున్నారు. కానీ ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించే కొన్ని తాజా అధ్యయనాల ప్రకారం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న చర్యల పట్ల ప్రజలలో మంచి స్పందన కనిపిస్తోంది. ‘సూపర్ సిక్స్’ హామీలు ఇంకా పూర్తిగా అమలులోకి రాకపోయినప్పటికీ, వాటి పట్ల ప్రజల్లో మంచి అంచనాలున్నాయన్నది నిజం. మరోపక్క ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు, రోడ్డు అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకుంటున్న చర్యలు, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలకి గమనించబడుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే, కొత్త ప్రభుత్వం పట్ల ప్రజలు ఇప్పటికీ విశ్వాసంతో ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై ప్రజల నమ్మకం గట్టిగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రజలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను గుర్తించి అంగీకరించడమే కాకుండా, వచ్చే సంవత్సరంలో తమకు మేలు జరుగుతుందన్న ఆశలు పెట్టుకున్నట్టు అర్థమవుతుంది. దీంతో ఇప్పటివరకు ప్రజలు తమ పై ఉంచిన నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది అన్న విషయం స్పష్టమవుతోంది.
రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయి ఉన్నా, ఎన్నికల్లో ఇచ్చిన మాటమేరకు పింఛను పథకంపై ముందడుగే వేశారు. అప్పటి వరకూ అమలవుతున్న రూ.3వేల పింఛనును ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచి రూ.4 వేలను చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచే పెంపును వర్తింపజేసి.. జూలై 1న పింఛను కింద రూ.7 వేల చొప్పున ఇవ్వడంతోనే కూటమి సర్కారు ప్రజా నమ్మకాన్ని చూరగొంది. దివ్యాంగులకిచ్చే రూ.3 వేల పింఛనును రూ.6 వేలకు పెంచి.. తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డవారికి రూ.5 వేల పింఛనును రూ.15 వేలు చేసిన ఘనత కూటమిదే. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస చేసుకునే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛను కింద అందే రూ.5 వేల మొత్తాన్ని రూ.10 వేలకు పెంచింది.
అన్నదాత సుఖీభవ పథకం కింద దాదాపుగా 55 లక్షలమంది రైతులకు ఆర్థిక సాయం అందిస్తోంది. పీఎం కిసాన్ పథకంతో కలిపి ఏడాదికి మూడు విడతల్లో రూ.20 వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉన్నా.. తల్లికి వందనం కింద ఒక్కొక్కరికీ ఏడాదికి రూ. 15 వేల చొప్పున ఆర్థికసాయం ఈనెల నుంచే అందించనుంది. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచేందుకు అత్యాధునిక సేద్యం ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయంగా వస్తోన్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఏఐ ద్వారా ఆధునిక లాభసాటి సేద్యంవైపు రైతులను మళ్లిస్తోంది. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చి.. ఆరోగ్యకర సేద్యపు వాతావరణాన్ని ఆవిష్కరించే ప్రణాళికలు అమలు చేస్తోంది.
ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలకు కేంద్రం నుంచి రూ.15 వేల కోట్లు సాధించింది. విశాఖ స్టీల్ పరిరక్షణకు రూ.11 వేల కోట్లు, విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి ప్రధాని శంకుస్థాపన, ఓర్వకల్లు పారిశ్రామికవాడకు రూ.2,786 కోట్లు, కొప్పర్తి పారిశ్రామికవాడకు రూ.2,137 కోట్లు కేంద్రంనుంచి సాధించడం విశేష ఫలితమే. హంద్రీనీవా విస్తరణకు రూ.3,800 కోట్లతో వేగంగా పనులు నిర్వహిస్తోంది. కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్మాణాత్మక కృషి సలిపింది. ఐదు మెడికల్ కళాశాలల నిర్మాణానికి రూ.1,198.12 కోట్లు కేటాయించింది. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు జల జీవన్ మిషన్ పునరుద్దరించింది. కర్నూల్లో 300 ఎకరాల్లో డ్రోన్ హబ్ ఏర్పాటు, 35వేల డ్రోన్ పైలట్లకు శిక్షణ లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25లో రాష్ట్ర జీడీపీ రూ.16 లక్షల కోట్లకు చేరుకుంది. సుదీర్ఘ సముద్రతీరం, విశాల భూభాగం, పెట్టుబడులకి అనుమైన వాతావరణం, అందుబాటులో మానవ వనరులు.. అన్నిటికీతోడు రాష్ట్రాన్ని సమర్థంగా ముందుకు నడిపే నాయకుడు. వెరసి ముక్కోణపు వ్యూహంతో ఏపీ ముందడుగు వేసింది, వేస్తోంది. భవిష్యత్ అవసరాల్ని అందుకునే భారీ ప్రణాళికలు ఇప్పటికే ఉన్నాయి.
రాష్ట్రాన్ని అమరావతి, తిరుపతి, కర్నూలు-ఓర్వకల్లు, గోదావరి జోన్లుగా విభజించి ప్రాంతీయంగా అభివృద్ధి చేయాలని, రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖపట్నాన్ని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది ఏపీ సర్కారు. ప్రస్తుతం అమరావతిలో క్వాంటం వ్యాలీ, కర్నూలు- ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, విశాఖపట్నంలో మెడిటెక్ జోన్లను అభివృద్ధి చేయాలని, వీటికితోడు విశాఖ-చెన్నై, హైదరాబాద్- బెంగళూరు, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లలో పారిశ్రామిక నగరాల అభివృద్ధికి శ్రీకారం చుడుతోంది. సౌర, పవన, బ్యాటరీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, పంప్డ్ స్టోరేజీ ఉత్పత్తి ద్వారా రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్ తయారుచేసే దిశగా ప్రయాణం సాగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాష్ట్రంలో నవకల్పనలను ప్రోత్సహించి పరిశ్రమ- విద్యారంగం మధ్య అనుసంధానాన్ని ఏర్పాటు చేసేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.