UN: అమెరికా అధ్యక్షుడినైన నాకే అవమానమా…? పదేపదే ఐక్యరాజ్యసమితి ఘటనను గుర్తు చేసుకుంటున్న ట్రంప్…

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump).. ఐక్యరాజ్యసమితి (UN) ప్రధాన కార్యాలయంలో ఎదురైన చేదు అనుభవాలను ఇంకా మర్చిపోలేదు. పదేపదే దీన్ని గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు.. ఈ ఘటనలో తనకు ఘోర అవమానం జరిగిందని.. దీనిపై దర్యాపు చేయాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి లేఖ రాశానని తన సొంత మాధ్యమం ట్రూత్ సోషల్‌లో తెలిపారు. అందులో సీక్రెట్ సర్వీస్‌ను భాగస్వామి చేయాలని కోరానని స్పష్టం చేశారు ట్రంప్.
ఐక్యరాజ్యసమితిలో తనకు అవమానం జరిగిందని ట్రంప్ గుర్తు చేసుకుంటున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు అత్యంత దురదృష్టకరమైన ఘటనలు జరిగాయి. మొదట ఎస్కలేటర్‌పై అడుగుపెట్టిన వెంటనే ఆగిపోయింది. మెలనియా నేను మెట్లు ఎక్కి వెళ్లాం. ఆ తర్వాత టెలిప్రాంప్టర్ పని చేయలేదు. అది దాదాపు 15 నిమిషాలపాటు ఆగిపోయింది. కానీ శుభవార్త ఏమిటంటే ఈ ప్రసంగానికి అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. ఇక మూడోది ఆడిటోరియంలోని సౌండ్ సిస్టమ్ ఘోరంగా ఉంది. నేను ప్రసంగం ముగించిన తర్వాత నా భార్య మెలనియావైపు చూసి అడగ్గా.. ఆమె ఒక్క ముక్క కూడా వినిపించలేదని చెప్పారు. ఇవి యాదృచ్ఛికం కాదు. ఆ సంస్థ తనను తాను చూసి సిగ్గుపడాలి’ అని ట్రంప్ పేర్కొన్నారు.
దీనిపై ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ స్పందించారు. ‘ట్రంప్ బృందంలోని వీడియోగ్రాఫర్ వారిని తన కెమెరాలో చిత్రీకరించడానికి వెనక్కి తిరిగి ఎస్కలేటర్ పై భాగానికి వెళ్తున్నారు. పై భాగానికి ఆయన చేరే సమయానికి ట్రంప్ దంపతులు ఎస్కలేటర్ మెట్లపై అడుగుపెట్టారు. వీడియోగ్రాఫర్ అనుకోకుండా భద్రత బటన్‌ను నొక్కి ఉంటారు. అందుకే అది ఆగింది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ దీనిని గుర్తించింది’ అని పేర్కొన్నారు.