Savindra Reddy: సీబీఐకి సవీంద్రా రెడ్డి కేసు.. హైకోర్టు సంచలన ఆదేశాలు

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు కె.సవీంద్రరెడ్డి (Savindra Reddy) అరెస్టు కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తాడేపల్లి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి అప్పగించింది. సమగ్ర విచారణ జరిపి అక్టోబర్ 13 లోపు ప్రాథమిక నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పోలీసుల అరెస్టు సమయంపై గందరగోళం, భార్య ఫిర్యాదును పట్టించుకోకపోవడం, సివిల్ డ్రెస్‌లో అరెస్టు చేయడం వంటి లోపాలను హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. హైకోర్టు (AP High Court) నిర్ణయంపై వైసీపీ హర్షం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వంపై కక్ష సాధింపుకు ఇది నిదర్శమని విమర్శిస్తోంది.
వైసీపీ (YCP) సోషల్ మీడియా (Social Media) యాక్టివిస్టు సవీంద్రరెడ్డిని ఈ నెల 22న పోలీసులు అరెస్టు చేశారు. తాడేపల్లి మండలంలోని పాతూరులో సాయంత్రం బజారుకు వెళ్లినప్పుడు, కొంతమంది పోలీసులు సివిల్ డ్రస్సుల్లో వచ్చి సవీంద్రా రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సవీంద్రరెడ్డి భార్య లక్ష్మీ, అదే రోజు సాయంత్రం పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారని తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు ఈ ఫిర్యాదును పట్టించుకోలేదు. FIR నమోదు చేయలేదు. జనరల్ డైరీ ఎంట్రీగా మాత్రమే రికార్డ్ చేశారు. దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
సవీంద్రా అరెస్టు సమయంపైన కూడా గందరగోళం నెలకొంది. కన్ఫెషన్ రిపోర్టులో సవీంద్రరెడ్డిని సాయంత్రం 7:30 గంటలకు అరెస్టు చేసినట్లు నమోదు చేశారు. కానీ రిమాండ్ రిపోర్టులో మాత్రం 8:30 గంటలకు అని రాశారు. సవీంద్రరెడ్డి తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి, సీసీటీవీ ఫుటేజ్‌ను కోర్టుకు సమర్పించి, ఆయన్ను 6:30 గంటలకే అదుపులోకి తీసుకున్నట్లు వాదించారు. సవీంద్రరెడ్డి ఫోన్ 6:21 గంటలకు స్విచ్ ఆఫ్ అయినట్లు రికార్డులు చూపించారు. 7 గంటలకు సవీంద్రా రెడ్డి భార్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అప్పటికే సవీంద్రా రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్టు లాయర్ వాదించారు. అయితే సవీంద్రా రెడ్డిని ప్రతిపాడు పోలీసులు అరెస్టు చేశామని చెప్పారు. కానీ లాలాపేట SHO శివప్రసాద్ చేతిలో ఆయన అరెస్ట్ జరిగినట్లు వెల్లడైంది.
పైగా సవీంద్రరెడ్డిని గంజాయి అక్రమ రవాణా కేసులో మూడో నిందితుడిగా అరెస్టు చేయడం మరో సంచలనానికి కారణమైంది. అరెస్టు అనంతరం గుంటూరు ఆరో అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో ఆయన్ను హాజరు పరిచారు. అయితే, తనకు గంజాయి కేసు గురించి ఏమీ తెలియదని చెప్పారు. హైకోర్టు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తింది. గంజాయి అక్రమ రవాణాపై ఆధారాలు ఏమైనా ఉన్నాయా.. గంజాయి కేసు ఎలా పెట్టారని ప్రశ్నించింది. అందుకే ఈ విషయాలన్నీ బయటకు రావాలంటే సీబీఐ దర్యాప్తు అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. దీన్ని సీబీఐ సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని ఆదేశించింది. వచ్చే నెల 13 లోపు ప్రాథమిక విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని తెలిపింది.
కూటమి ప్రభుత్వం తమ సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధిస్తోందని వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. ఇప్పటివరకూ వందమందికి పైగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదైనట్లు చెప్తోంది. సవీంద్రా రెడ్డి అరెస్టు అంశంలో పోలీసుల ప్రవర్తించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం తమకు బలం చేకూరుస్తోందని, ఈ కేసును సీబీఐకి అప్పగించడాన్ని బట్టి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని వైసీపీ వాదిస్తోంది.