US: అమెరికా వర్సిటీలపై హెచ్ 1బీ పెంపు ఎఫెక్ట్..!

అమెరికా వర్సిటీలపై హెచ్ -1బీ వీసా ఫీజు (H-1B Fee) పెంపు ఎఫెక్ట్ గట్టిగా పడింది. ట్రంప్ సర్కారు భారీగా ఫీజు పెంచడంతో అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకూ (US universities) కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వం నుంచి వచ్చే పరిశోధనల నిధులకు కోతపడటంతో ఇబ్బంది పడుతున్న ఈ విద్యాసంస్థలు తాజా నిర్ణయం మోయలేని ఆర్థిక భారమైంది.
అమెరికాలో (USA) సాఫ్ట్‌వేర్, ఆర్థిక సేవల కంపెనీలే కాదు.. మెడికల్ స్కూల్స్, స్టేట్ యూనివర్శిటీలు, ఐవీ లీగ్ స్కూల్స్ ఈ రకం వీసాలపై ఆధారపడుతున్నాయి. ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం (Stanford University) ఆ దేశంలో విద్యాసంస్థల్లో మరెవరూ వాడనన్ని హెచ్-1బీ వీసాలను వినియోగిస్తోంది. ఇక్కడ సిబ్బందిలో 500 మందికి ఈ రకం వీసాలున్నాయి. ఈ విశ్వవిద్యాలయం ఏటా 270 మందిని సగటున ఈ వీసాపై నియమించుకొంటోందని గణాంకాలు చెబుతున్నాయి. కొత్తగా పెరిగిన ఫీజు ప్రకారం వీసాలకే 27 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక కొలంబియా విశ్వవిద్యాలయం, ది యూనివర్శిటీ ఆఫ్ మిషిగన్, హార్వర్డ్, వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ఏటా వందల సంఖ్యలో విదేశీ సిబ్బందిని నియమించుకొంటున్నాయి. ప్రస్తుత విధానమే కొనసాగితే ఒక్కో విద్యాసంస్థపై ఏటా 10-20 మిలియన్ డాలర్ల అదనపు భారం తప్పదు.
చాలా విశ్వవిద్యాలయాలు విదేశాలకు చెందిన ప్రతిభావంతులను సిబ్బందిగా, పరిశోధకులుగా, బోధనా సిబ్బందిగా నియమించుకోవాల్సి ఉంటుంది. అలా వచ్చిన వారిలో చాలా మంది అమెరికా పౌరసత్వం స్వీకరిస్తున్నారు. 2023 గణాంకాల ప్రకారం 58శాతం మంది పోస్ట్ డాక్టోరల్ సిబ్బంది ఈ వీసాలతో వచ్చినవారే. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పైగా విశ్వవిద్యాలయాల హెచ్-1బీ దరఖాస్తులకు లాటరీ విధానం నుంచి మినహాయింపు ఉంది.