Russia: రష్యా వర్సెస్ నాటో.. మీ ఫైటర్స్ జెట్స్ వస్తే కూల్చేసామని క్రెమ్లిన్ కు హెచ్చరిక

రష్యా ఉక్రెయిన్ యుద్ధం విస్తరిస్తోందా..? యూరోపియన్ యూనియన్, అమెరికా ఆయుధ సాయంతోనే ఉక్రెయిన్ యుద్ధరంగంలో నెట్టుకొస్తోందని రష్యా (Russia) భావిస్తోందా..? అంటే అవుననే చెప్పాలి. ఇదే విషయాన్ని పదేపదే పుతిన్ చెప్పారు కూడా. దీనికి తోడు ఇటీవలి కాలంలో ఎస్తోనియా గగనతలాన్ని రష్యా డ్రోన్లు, ఫైటర్ జెట్లు పదేపదే ఉల్లంఘిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఉద్దేశ్యపూర్వకంగా క్రెమ్లిన్ చేస్తోందని యూరోపియన్ యూనియన్ ఆరోపిస్తుండగా… అదేం లేదు పొరపాటున జరిగిందని రష్యా వాదిస్తోంది. ఈ సమయంలో రష్యాకు.. ఈయూ నుంచి వార్నింగ్ రావడం ఆసక్తికరంగా మారింది.
గగనతల సరిహద్దులను ఉల్లంఘిస్తే నాటో కూటమి పూర్తి శక్తితో స్పందించడానికి సిద్ధంగా ఉన్నట్లు యూరోపియన్ దేశాలు రష్యాను హెచ్చరించాయి (Europeans Privately warn Russia). తాజాగా నాటో సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా మాస్కోలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల దౌత్యవేత్తలు రష్యా మిగ్-31 ఫైటర్‌జెట్ చొరబాట్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశం పూర్తిగా రహస్యంగా జరిగింది. రష్యా కమాండర్లు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతున్నారన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే దీనిని రష్యా అధికారులు తిరస్కరించారు.
తమ విమానాలు ఎస్తోనియా గగనతలంలోకి చొరబడలేదని.. నాటో (NATO)ను పరీక్షించే చర్యలు కావని రష్యా (Russia) అధికారులు వాదించారు. ఇక పోలెండ్ గగనతలంలోకి డ్రోన్లు చొరబడటంపై స్పందిస్తూ.. అది ఓ తప్పు కారణంగా చోటు చేసుకొందని వివరణ ఇచ్చారు. అయితే ఉక్రెయిన్ దాడికి ప్రతికారంగానే క్రిమియాలో తమ చర్యలు ఉన్నాయని వారు వెల్లడించారు. నాటో మద్దతు లేకుండా కీవ్ అటువంటి ఆపరేషన్లు చేయలేదని పేర్కొన్నారు. ఇక తాము యూరోపియన్ దేశాలతో పోరాడుతున్నట్లే భావిస్తున్నామన్నారు. ఈ సమావేశం జరిగిందని జర్మనీ అధికారులు ధ్రువీకరించారు. ఇక ఇటీవల క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ.. తమ యుద్ధవిమానాలు అంతర్జాతీయ నిబంధనలు పాటిస్తున్నాయని చెప్పారు.
నాటో (NATO) లోని తూర్పు ప్రాంత దేశాలు ఈ నెలలో పలుమార్లు రష్యా (Russia) విమానాలు, డ్రోన్లు తమ గగనతలంలోకి వచ్చినట్లు వెల్లడించాయి. అవసరమైతే నాటో రష్యా విమానాలను కూల్చేయాలని ట్రంప్ కూడా ఇటీవల అభిప్రాయపడ్డారు కూడా.