Nara Lokesh: భాగస్వామ్య సదస్సు-2025 అధికారిక వెబ్ సైట్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

భాగస్వామ్య సదస్సు విజయవంతానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయండి
సంస్థలతో అవగాహనా ఒప్పందాలపై ప్రత్యేక దృష్టి!
విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహణపై మంత్రివర్గ ఉపసంఘం విస్తృత సమీక్ష
ఉండవల్లిః విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సు విజయవంతానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా పటిష్ట ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పర్యవేక్షణకు సంబంధించిన వివిధ కమిటీల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రివర్గ ఉపసంఘం విస్తృత సమీక్ష నిర్వహించింది.
మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఛైర్మన్ హోదాలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను వివరించడంతో పాటు వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. క్లస్టర్ విధానంలో పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం ఉంది. ఒక్క జూమ్ కాల్ ద్వారా ఆర్సెల్లర్ మిట్టల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఏపీకి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు సాధించిన పెట్టుబడులు, తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక సంస్థల గురించి వివరించాలన్నారు. కార్యక్రమం అజెండాతో పాటు వేదిక రూపకల్పన, నమూనాపై సమీక్షలో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రివర్గ ఉపసంఘం పలు సూచనలు చేసింది. అక్టోబర్ నెలలో వివిధ దేశాల్లో చేపట్టనున్న రోడ్ షోల గురించి అధికారులు వివరించారు. ఆహ్వానాలు, ప్రోటోకాల్, వసతి, రవాణ, భద్రత, నగర సుందరీకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, మీడియా, ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయా కమిటీల ఉన్నతాధికారులు వివరించారు.
ఈ సందర్భంగా భాగస్వామ్య సదస్సు-2025 అధికార వెబ్ సైట్ ను మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, కొండపల్లి శ్రీనివాస్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.