Trump Tariffs: ట్రంప్ సుంకాలతో భారత్‌పై ఒత్తిడి.. నాటో చీఫ్ వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం!

భారత్‌పై ట్రంప్ సుంకాలతో (Trump Tariffs) రష్యాపై ఒత్తిడి పెరిగిందని, ఉక్రెయిన్ యుద్ధం ఆపడం గురించి ప్రధాని మోడీ కూడా రష్యాను ప్రశ్నించడం ప్రారంభించారని నాటో చీఫ్ మార్క్ రుట్టె అన్నారు. ఈ విషయం పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మోడీ ఫోన్ చేసి అడగడం మొదలు పెట్టారని ఆయన (Mark Rutte) చెప్పారు. ఈ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం (Indian Government) తీవ్రంగా ఖండించింది. అమెరికా విధించిన 50 శాతం సుంకాలు ఉక్రెయిన్ యుద్ధంపై ప్రభావం చూపుతున్నాయని, ముఖ్యంగా రష్యాపై ఈ సుంకాలు (Trump Tariffs) తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని రుట్టె ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
“నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రతిరోజూ వ్లాదిమిర్ పుతిన్‌కు కాల్ చేసి, ‘నేను నీకు సపోర్ట్ చేస్తాను కానీ… ఉక్రెయిన్‌పై నీ ప్లాన్ ఏంటో చెప్పు? నాపై యూఎస్ 50 శాతం సుంకాలు వేసింది’ అనడం మొదలు పెట్టారు” అని మార్క్ రుట్టె (Mark Rutte) అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని, అసత్యమైన ప్రచారాలని భారత విదేశాంగ శాఖ (Ministry of External Affairs) స్పష్టం చేసింది. “ప్రధాని నరేంద్ర మోడీ, ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె ఊహించిన విషయం మా దృష్టికి వచ్చింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యాలు. భారత్, రష్యా మధ్య అసలు అలాంటి సంభాషణే జరగలేదు” అని పేర్కొంది.
నాటో వంటి ప్రముఖ సంస్థ నాయకత్వం నుంచి బాధ్యతాయుతమైన, వాస్తవమైన వ్యాఖ్యలు మాత్రమే ఆశించామని, ఇకపై ఇలా అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని నాటోకు భారత విదేశాంగ శాఖ (Ministry of External Affairs) సలహా ఇచ్చింది. ఇలా తప్పుదోవ పట్టించే ఊహాజనిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఘాటుగా బదులిచ్చింది.