Balakrishna: కూటమిని చిక్కుల్లోకి నెట్టిన బాలయ్య..!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చేసిన కామెంట్స్ పై ఇప్పుడు రచ్చ జరుగుతోంది. జగన్ (YS Jagan)ను సైకోగాడు (psycho) అనడం, చిరంజీవిని (Chiranjeevi) తక్కువ చేసి మాట్లాడడం, ఈ కూటమి ప్రభుత్వంలో కూడా తనకు గౌరవం ఇవ్వలేదనడం ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు సినిమా వాళ్లను అవమానపరిచారనే దానిపై మొదలైన రగడ ఇప్పుడు కూటమిలో కుంపట్లకు కారణమవుతోంది. సినిమా ఇండస్ట్రీలో విభేదాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. దీంతో వీటిని చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) లకు ఏర్పడింది.
అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి. జగన్ ను సైకోగాడు అనడం వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. చట్టసభల్లో అలాంటి భాషను ఎవరూ హర్షించరు. బాలకృష్ణ ఈ విషయంలో సంయమనం పాటించి ఉంటే బాగుండేది. కానీ ఆయన నోరు జారారు. దీంతో బాలకృష్ణ క్షమాపణ చెప్పాలనే డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది. గత ప్రభుత్వంలో టీడీపీ వాళ్ల కుటుంబసభ్యులను కించపరిచారని ఇన్నాళ్లూ ఆరోపించిన నేతలు, ఇప్పుడు బాలయ్య మాటలకు ఏం సమాధానం చెప్తారనే ప్రశ్నించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఈ విషయంలో బాలకృష్ణ స్పందించి క్షమాపణ చెప్తే పరిస్థితిలో మార్పు రావచ్చు.
ఇక సినిమా వాళ్లు జగన్ ను కలిసేందుకు వెళ్లినప్పుడు మొదట ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని, చిరంజీవి గట్టిగా అడగడంతో ఆయన దిగి వచ్చారని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. అయితే బాలకృష్ణ ఈ విషయాన్ని ఖండించారు. అప్పుడెవరూ గట్టిగా అడగలేదన్నారు. అయితే చిరంజీవికి అవమానం జరిగిన మాట మాత్రం వాస్తవం అన్నారు. అయితే చిరంజీవిని అంతమాట అంటావా.. అని ఇప్పుడు మెగాస్టార్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోటీ దశాబ్దాలుగా ఉంది. ఇప్పుడు కూడా అది కనిపించింది.
మరోవైపు.. కూటమి ప్రభుత్వంలో FDC సమావేశానికి రూపొందించిన జాబితాలో తనను 9వ స్థానంలో ఉంచడం పైన కూడా బాలకృష్ణ అగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి ఎలా మర్యాద ఇవ్వాలో తెలీదా అని బాలయ్య ప్రశ్నించారు. ఈ లిస్ట్ ఎవడు రెడీ చేశాడంటూ మంత్రి కందుల దుర్గేశ్ ను అడిగినట్లు కూడా ఆయన చెప్పారు. ఇది కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. ప్రస్తుత సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ జనసేనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇది టీడీపీ, జనసేన మధ్య విభేదాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.
కూటమి ప్రభుత్వం మరో 10-15 ఏళ్లు కొనసాగాలని అటు పవన్ కల్యాణ్, ఇటు చంద్రబాబు కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలకృష్ణ కామెంట్స్ సహజంగానే ఆ రెండు పార్టీల మధ్య విభేదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వంలో చిరంజీవి భాగస్వామి కాకపోయినా ఆయన సోదరులు పవన్ కల్యాణ్, నాగబాబు కీలకంగా ఉన్నారు. కందుల దుర్గేశ్ కూడా ఆ పార్టీకి చెందిన వ్యక్తే. ఇప్పుడు వీళ్లందరినీ బాలకృష్ణ చిక్కుల్లో పడేశారు. ఈ చిక్కుముడులను విప్పాల్సిన బాధ్యత ఇప్పుడు చంద్రబాబుపై పడింది.