David Beckham: బెఖమ్ పాఠశాల పర్యటనపై స్పందించిన నారా లోకేష్..
ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ లెజెండ్, యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ సర్ డేవిడ్ బెఖమ్ (Sir David Beckham) ఇటీవల ఆంధ్రప్రదేశ్ సందర్శించిన విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల అభ్యాస వాతావరణాన్ని దగ్గరగా చూడాలన్న ఉద్దేశంతో ఆయన ఏపీలోని పలు స్కూల్స్‌కు వెళ్లి విద్యార్థులతో సమయం గడిపారు. స్కూల్ ప్రాంగణంలో పిల్లలు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ, వారితో ముచ్చటిస్తూ, మైదానంలో ఫుట్‌బాల్ ఆడిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
విశాఖపట్నం (Visakhapatnam) లో ఆయన సందర్శన మరింత హడావుడిని సృష్టించింది. స్థానిక ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌కు వచ్చి విద్యార్థులు చేస్తున్న ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కార్యకలాపాలను పరిశీలించారు. “ఎడ్యుకేషన్ అబోవ్ ఆల్” (Education Above All) మద్దతుతో నడుస్తున్న మంత్రా4చేంజ్ (Mantra4Change) కార్యక్రమం భాగంగా ఆయన ఈ పర్యటన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీతో పాటు బీహార్ (Bihar) , నాగాలాండ్ (Nagaland) , ఒడిశా (Odisha ) ప్రాంతాల్లోని తరగతి గదులను అభ్యాసానికి అనువుగా మార్చే పనులు జరుగుతున్నాయి.
మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఈ పర్యటనపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా బెఖమ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి పిల్లలతో మాట్లాడటం, వారికి ప్రేరణనివ్వడం ఎంతో విలువైన విషయం అని ఆయన పేర్కొన్నారు. విశాఖ సమీపంలోని కొత్తవలసలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులతో గడిపిన క్షణాలు అక్కడి వాతావరణాన్ని మరింత ఆహ్లాదంగా చేశాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పిల్లల కలలు, ఎదుగుదల పట్ల బెఖమ్ చూపించిన శ్రద్ధ, ప్రేమ అభినందనీయమని లోకేష్ అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే, బెఖమ్ కూడా తన సందర్శనను ఎంతో ఆనందంగా అనుభవించినట్లు వీడియోలో పేర్కొన్నారు. “భారతదేశానికి రావడం నాకు ఎంతో ప్రత్యేకం. మళ్లీ స్కూల్‌కు వెళ్లి పిల్లలతో ఉండటం నాకెంతో సంతోషం,” అని ఆయన చెప్పారు. తన సాకర్ నైపుణ్యాలను విద్యార్థులకు చూపిస్తూ, వారితో కలిసి ఫుట్‌బాల్ ఆడిన దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్కూల్లోని బాలికలు చేసిన వెల్కమ్ డ్యాన్స్, పిల్లలు తయారు చేసిన సంగీత వాద్యాలు, మొక్కలు నాటే కార్యక్రమం వంటి అంశాలు ఆయనను ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఎం జె పి సోసైటీ (MJP Society) భాగస్వామ్యంతో, మంత్రా4చేంజ్ ఏర్పాటు చేసిన అభ్యాస విధానాలు రాష్ట్రంలో పెద్ద మార్పుకు దారితీశాయి. ప్రస్తుతం ఏపీ అంతటా 107 రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఈ నూతన శిక్షణ విధానం అమలు అవుతోంది. దాదాపు 18,000 మంది విద్యార్థులు ‘చేయడం ద్వారా నేర్చుకోడానికి’ ప్రోత్సాహం పొందుతున్నారు. ఈ మార్పులను ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం దగ్గరగా చూశాడన్న గర్వంతో ఏపీ ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






