Canada: బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్ తో మంత్రి లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ లో కెనడియన్ పెట్టుబడులకు సహకారం అందించండి
టొరంటో (కెనడా): స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలతో శరవేగంగా దూసుకెళ్తున్న ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులకు సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా (Business Council of Canada – BCC) ప్రెసిడెంట్ గోల్డీ హైదర్ తో మంత్రి లోకేష్ టొరంటోలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… మా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి సుదీర్ఘ పాలనానుభవంతోపాటు సైబరాబాద్ వంటి నగరాలను నిర్మించిన చరిత్ర ఉంది. ఆయన నేతృత్వంలో గత 18నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు రూ.20లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. మరికొన్ని పెట్టుబడులు పైప్ లైన్ లో ఉన్నాయి. 1053 కి.మీ.ల సుదూర తీర ప్రాంతం, సువిశాలమైన రోడ్లు, రైలు మార్గాలు, ఆరు ఆపరేషన్ పోర్టులు, ఆరు ఎయిర్ పోర్టులతో విస్తృతమైన కనెక్టివిటీ కలిగి ఉంది. మరో ఆరునెలల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుతోపాటు మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి వస్తాయి. విశాఖపట్నం – చెన్నై ఇండస్టిరియల్ కారిడార్ లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్ వంటి గ్లోబల్ సంస్థలు ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. టీసీఎస్ కాగ్నిజెంట్ వంటి ఐటి కంపెనీలు, డేటా సెంటర్ల రాకతో విశాఖపట్నం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం. ఏపీలో పెట్టుబడులకు కెనడియన్ పెట్టుబడిదారులను ప్రోత్సహించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా గోల్డీ హైదర్ మాట్లాడుతూ… ఒట్టావా కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ కెనడాలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థల సీఈవోలు, వ్యాపారవేత్తలతో దేశ ఆర్థికవ్యవస్థ, పోటీతత్వం, గ్లోబల్ స్థాయి ప్రతిష్టను బలోపేతం చేయడానికి కృషిచేస్తుంది. ఇంధనం, ఆర్థిక, సాంకేతికత, తయారీ వంటి విభిన్న రంగాల నుంచి 150కు పైగా సంస్థల ప్రతినిధులు బీసీసీలో భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. ఈ సంస్థలన్నీ కలిపి 1.7 మిలియన్ కెనడియన్లకు ఉపాధి కల్పించడమేగాక దేశ జీడీపీలో గణనీయమైన వాటా కలిగి ఉన్నట్లు చెప్పారు. తాము పన్ను సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ, పెట్టుబడుల ఆకర్షణ, వాణిజ్యం & అంతర్జాతీయ సంబంధాలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పురోగతి (ఉదా. USMCA, CPTPP), సప్లయ్ చైన్ బలోపేతంపై దృష్టి సారిస్తున్నాం. కృత్రిమ మేధస్సు (AI) వినియోగం, సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీ ఆధారిత ఉత్పాదకతలను ప్రోత్సాహిస్తున్నాం. క్లీన్ టెక్నాలజీ, కార్బన్ ప్రైసింగ్ ఫ్రేమ్ వర్క్, సుస్థిర వనరుల అభివృద్ధికి మద్దతు ఇస్తున్నాం. ఆర్థిక భాగస్వామ్యాల చేరిక (ఇన్క్లూజన్) కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నాం. G7/B20 వంటి అంతర్జాతీయ సమావేశాలు, ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) వంటి అంతర్జాతీయ వేదికల్లో కెనడియన్ వ్యాపార ప్రయోజనాలే మా ధ్యేయం. యూఎస్ బిజినెస్ రౌంటేబుల్ (Business Roundtable, U.S.), బిజినెస్ యూరోప్ (Business Europe) వంటి సమాన సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో కెనడియన్ సంస్థల పెట్టుబడులకు తమవంతు సహకారం అందిస్తామని గోల్డీ హైదర్ చెప్పారు.






