Andhra pradesh: లిక్కర్ కేసు మళ్ళీ యాక్టివ్ అయిందా..?

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం(Liquor Scam)లో త్వరలో మరో కీలక అరెస్టు జరగబోతుంది అనే ప్రచారం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. లిక్కర్ కుంభకోణం విషయంలో ప్రస్తుతం దర్యాప్తు బృందాలు కాస్త వెనకడుగు వేసినట్లుగా కనపడుతుంది అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. 2019 నుంచి 2024 వరకు పెద్ద ఎత్తున లిక్కర్ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వినిపించాయి. రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో మద్యం కుంభకోణానికి శ్రీకారం చుట్టిందని టీడీపీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్ లు లేకపోవడం అప్పట్లో సంచలనంగా మారిన అంశం.
రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత దీనిపై క్రమంగా విచారణకు చంద్రబాబు(Chandrababu Naidu) సర్కారు అడుగులు వేసింది. ఇందులో కీలకంగా భావించిన పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఏ 1 కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తో పాటుగా జగన్(Ys Jagan) మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి.. ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి.. వైయస్ భారతి వ్యాపార వ్యవహారాలు చూసే.. బాలాజీ గోవిందప్ప సహా పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి విచారణలో పలు కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణలో ఆసక్తికర పేర్లు బయటకు వచ్చినట్లు ప్రచారం జరిగింది.
కానీ ఇప్పటివరకు ఆ కీలక వ్యక్తులను అరెస్టు చేసే విషయంలో దర్యాప్తు బృందాలు ముందుకు అడుగు వేయలేకపోయాయి. జూన్ 10 తర్వాత అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరిగింది. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న అనుమానితుల నుంచి కీలక సమాచారం రాబట్టిన తర్వాత మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని వార్తలు సైతం వినిపించాయి. అయితే దీనికి సంబంధించి మీడియాలో కూడా ప్రస్తుతం ఎటువంటి చర్చలు జరగడం లేదు. కానీ త్వరలోనే కీలక వ్యక్తులను అరెస్టు చేసే అవకాశం ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న అప్పటి ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖులను అరెస్టు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం ప్రస్తుత ప్రభుత్వం ఎదురుచూస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక న్యాయపరమైన చిక్కులు రాకుండా ఈ విషయంలో అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.