Kodali Nani: యాక్షన్ మోడ్ లోకి కొడాలి నాని! జగన్ వార్నింగ్ పనిచేసిందా?
2024 ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారం కోల్పోవడంతో పాటు, పార్టీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమి ప్రభావం ఎంతలా ఉందంటే.. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్లుగా, మీడియా ముందు నిత్యం గర్జించే నాయకులు సైతం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అందులో ముఖ్యంగా వినిపించే పేరు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని. అనారోగ్య కారణాలు, రాజకీయ పరాజయం లాంటి కారణాలతో దాదాపు 18 నెలల పాటు గుడివాడకు దూరంగా ఉన్న నాని, ఎట్టకేలకు మళ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. అయితే ఆయన రాక వెనుక పార్టీ అధినేత జగన్ సీరియస్ వార్నింగ్ ఉందనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ప్రతిపక్షంపై విరుచుకుపడే కొడాలి నాని, 2024లో ఓటమి తర్వాత అనూహ్యంగా సైలెంట్ అయ్యారు. గుడివాడలో తనను ఓడించడం ఎవరి తరం కాదని సవాల్ చేసిన ఆయన, ఓటమిని జీర్ణించుకోలేకపోయారనే టాక్ వచ్చింది. దానికి తోడు ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడం, బైపాస్ సర్జరీ జరగడంతో రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఈ 18 నెలల కాలంలో ఆయన గుడివాడ వైపు చూడకపోవడంతో, నాని ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఆయన వారసుడిని రంగంలోకి దించుతారని, తాను తెరవెనుక ఉంటారని ఊహాగానాలు వినిపించాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా, వైసీపీ పిలుపునిచ్చిన ఏ నిరసన కార్యక్రమంలోనూ కొడాలి నాని పాల్గొనలేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సీనియర్లు ఇలా ముఖం చాటేయడంపై అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలకమైన కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతల తీరుపై జగన్ సీరియస్ అయ్యారని, “యాక్టివ్ గా ఉంటారా? లేక ప్రత్యామ్నాయం చూసుకోమంటారా?” అని హెచ్చరించినట్లు భోగట్టా. పార్టీ మారే ఆలోచన లేకపోయినా, స్తబ్ధంగా ఉండటం పార్టీకి నష్టం చేస్తుందని జగన్ భావించారు. ఈ వార్నింగ్ ప్రభావమో లేక రాజకీయ అవసరమో కానీ, కొడాలి నాని ఎట్టకేలకు మౌనం వీడారు.
సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడలో ప్రత్యక్షమైన నాని, తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. అనారోగ్యం కారణంగానే దూరంగా ఉన్నానని, రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మరో ఆరు నెలల పాటు వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటానని, ఆ తర్వాత ప్రజా క్షేత్రంలోకి వచ్చి కూటమి ప్రభుత్వంపై పోరాటం చేస్తానని ప్రకటించారు. “జగన్ ను మళ్లీ సీఎం చేయడమే నా లక్ష్యం” అని ప్రకటించడం ద్వారా కేడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేశారు.
కొడాలి నాని ప్రకటన గుడివాడ వైసీపీ శ్రేణులకు పెద్ద ఊరటనిచ్చింది. నాయకుడు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న కార్యకర్తలకు ఈ ప్రకటన కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అయితే, ఆరోగ్యం సహకరించాక నాని మునుపటిలా తనదైన శైలిలో విరుచుకుపడతారా? లేక ఆచితూచి అడుగులు వేస్తారా? అన్నది వేచి చూడాలి. మొత్తానికి జగన్ వార్నింగ్ పని చేసినట్లుగానే కనిపిస్తోంది. బైపాస్ సర్జరీ తర్వాత విశ్రాంతిలో ఉన్నప్పటికీ, రాజకీయ అనివార్యత కొడాలి నానిని మళ్లీ జనం ముందుకు తెచ్చింది. ఆరు నెలల తర్వాత ఆయన చేయబోయే ఉద్యమాలు ఏ మలుపు తిరుగుతాయో, గుడివాడ పాలిటిక్స్ లో ఎటువంటి హీట్ పుట్టిస్తాయో చూడాలి.






