తూర్పుగోదావరి జిల్లా వాసికి.. నాసా అభినందనలు

కొత్తగా నాలుగు గ్రహశకలాలను గుర్తించినందుకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీ సత్యసాయి గురుకులం వైస్ ప్రిన్సిపాల్ కూచిపూడి గుర్రయ్య.. నాసా, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సెర్చ్ కొలాబరేషన్ (ఐఏఎస్‍సీ) నుంచి అభినందనలు అందుకున్నారు. గ్రహ శకలాలను గుర్తించేందుకు నాసా, ఐఏఎస్‍సీ ఆధ్వర్యంలో గత నెలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. భారత శాస్త్ర సాంకేతిక శాఖ అనుబంధ సంస్థ వీఐపీఎస్‍ఈటీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న గుర్రయ్య ఇందులో పాల్గొన్నారు. ఆ క్రమంలో వాటిని గుర్తించినట్లు వెల్లడించారు. గ్రహశకలాలను గుర్తించి, విశ్లేషించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉపయోగించినట్లు తెలిపారు. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా భారత ప్రభుత్వ విజ్ఞాన ప్రసారశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఆస్ట్రనాయిడ్ సెర్చ్ క్యాంపెయిన్‍కు ఆయనను ప్రచారకర్తగా ఎంపిక చేశారని పేర్కొన్నారు.