DSP: తిరుమల లడ్డూ వివాదం.. ముఖ్యమంత్రిపై డీఎస్పీ ఫిర్యాదు
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒక పోలీసు అధికారి (డీఎస్పీ) ఫిర్యాదు చేయడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతకు సంబంధించిన అంశం గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వివాదంలో తాజాగా ఒక ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రస్తుతం మెడికల్ లీవ్‌లో ఉన్న డీఎస్పీ స్థాయి పోలీసు అధికారి దేవరకొండ నాగవరప్రసాద్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది.
శ్రీకాకుళం జిల్లాలో గతంలో డీటీసీగా పనిచేసిన నాగవరప్రసాద్, ప్రస్తుతం అనంతపురం పీటీసీకి బదిలీ అయ్యారు. అయితే ఆయన అక్కడ చేరడానికి ఇష్టంగా లేరు. దీంతో వాలంటరీ రిటైర్మెంట్ (VRS) కోసం దరఖాస్తు చేసుకుని, ప్రస్తుతం మెడికల్ లీవ్‌లో ఉన్నారు.
ఆదివారం ఆయన గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు అందజేశారు. ఈ ఫిర్యాదులో కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే కాకుండా, కీలక నేతలు, సంస్థల పేర్లను కూడా చేర్చారు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్, నారా లోకేశ్, టీటీడీ మాజీ ఈవో శ్యామలరావు, ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహాన్యూస్.. తదితరులను ఆయన పిటిషన్లో ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి
డీఎస్పీ నాగవరప్రసాద్ తన ఫిర్యాదులో పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు చేయడం ద్వారా కోట్లాది మంది హిందూ భక్తుల విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీశారని ఆయన పేర్కొన్నారు. సరైన ఆధారాలు లేకుండా ప్రభుత్వం, కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ఈ అంశంపై డిబేట్లు నిర్వహించి భక్తులలో ఆందోళన కలిగించాయని ఆరోపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దేవుడి ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగారని, ఇది క్షమించరాని నేరమని ఆయన తన ఫిర్యాదులో వాదించారు.
ఈ ఫిర్యాదు వెనుక ఉన్న ఉద్దేశ్యాలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్వీసులో ఉన్న ఒక పోలీసు అధికారి, ప్రభుత్వంపై లేదా ముఖ్యమంత్రిపై ఈ విధంగా బహిరంగంగా ఫిర్యాదు చేయడం సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీల ఒత్తిడి లేదా ప్రోద్బలంతోనే ఈ అధికారి ఫిర్యాదు చేశారని అధికార పక్షం ఆరోపిస్తుండగా, దేవుడి పట్ల భక్తితోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని మరికొందరు వాదిస్తున్నారు. ఇప్పటికే ఈ లడ్డూ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఈ తరుణంలో ఒక ఉన్నతాధికారి చేసిన ఫిర్యాదు న్యాయపరంగా ఎంతవరకు నిలబడుతుందనేది ప్రశ్నార్థకం.
తిరుమల లడ్డూ వివాదం ఇప్పటికే ప్రజలలో తీవ్ర భావోద్వేగాలను నింపింది. ఇప్పుడు ఒక డీఎస్పీ నేరుగా ముఖ్యమంత్రిపైనే ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. ప్రభుత్వం ఈ ఫిర్యాదుపై ఎలా స్పందిస్తుంది? ఇది ఆ అధికారి కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అన్నది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి

















