TTD Ghee: తిరుమల లడ్డూ కల్తీపై ‘దినేష్ కుమార్’ కమిషన్
కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తూ, విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ 45 రోజుల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.
తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే వార్త దేశవ్యాప్తంగా దావాగ్నిలా వ్యాపించింది. భక్తుల విశ్వాసాలు, సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న అంశం కావడంతో ప్రభుత్వం దీనిపై మొదటి నుంచీ సీరియస్‌గా ఉంది. తొలుత ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ జరిపినప్పటికీ, ఈ కుంభకోణం వెనుక ఉన్న లోతైన కుట్రలను, బాధ్యులను శాస్త్రీయంగా గుర్తించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించింది.
ఏకసభ్య కమిషన్ ఏఏ అంశాలపై దృష్టి సారించాలి.. వేటిని విచారించాలనే దానిపై జీవోలో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలుకు అనుసరించిన నిబంధనలు ఏమిటి? టెండర్ల ప్రక్రియలో ఏవైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందా? టీటీడీ ల్యాబ్‌లలో నెయ్యి నాణ్యతను పరీక్షించే విధానంలో లోపాలు ఎక్కడ ఉన్నాయి? తనిఖీలను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారా? లడ్డూ తయారీలో వాడే ఇతర దినుసుల విషయంలో కూడా అక్రమాలు జరిగాయా? ఈ కల్తీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అధికారుల ప్రమేయం ఎంతవరకు ఉంది? లాంటి అంశాలపై సమగ్రంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సిట్ (SIT) ప్రాథమిక విచారణ జరిపి కొన్ని కీలక అంశాలను వెల్లడించింది. అయితే, ఆ నివేదికలోని కొన్ని అంశాలపై మరింత లోతైన విశ్లేషణ అవసరమని ప్రభుత్వం గుర్తించింది. కేవలం కిందిస్థాయి సిబ్బందిని కాకుండా, ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించిన పెద్దలను పట్టుకోవడమే లక్ష్యంగా ఈ దినేశ్‌కుమార్ కమిషన్ పనిచేయనుంది.
ఈ విచారణను వేగవంతం చేయాలని, 45 రోజుల్లోగా అన్ని ఆధారాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం గడువు విధించింది. ఈ నివేదిక అందిన తర్వాత, అందులోని సిఫార్సుల మేరకు దోషులపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
తిరుమల పవిత్రతను కాపాడటం, భక్తుల నమ్మకాన్ని పునరుద్ధరించడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలు. దినేశ్‌కుమార్ కమిషన్ నివేదిక ద్వారా ఈ కల్తీ కుంభకోణంలోని చీకటి కోణాలు వెలుగులోకి వస్తాయని భక్తులు ఆశిస్తున్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ అంశంపై రాబోయే 45 రోజులు అత్యంత కీలకం కానున్నాయి.

















