‘జాబ్ క్యాలెండర్’ ప్రకటించి… హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరో హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు. ప్రతియేటా ‘జాబ్ క్యాలెండర్’ను విడుదల చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. దానిని ఇప్పుడు అమలు చేసి చూపించారు. 2021-22 సంవత్సరానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. నిరుద్యోగులకు మరింత ఊరటనిచ్చే విధంగా మరిన్ని ఉద్యోగాలను ప్రకటించి, వారిలో నిబ్బరాన్ని నింపారు. 2021-22 సంవత్సరానికి గాను 10,143 ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ నియామకాలన్నీ అత్యంత పారదర్శకతతోనే చేస్తామని, మెరిట్ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 6,03,756 ఉద్యోగాలను భర్తీ చేశామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాలను భర్తీ చేశామని, రాగానే ఇంత పెద్ద సంఖ్యలో భర్తీ చేసిన ఘనత తమదేనని తెలిపారు. వీటిలో లక్షకు పైగా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేశామని, 19,701 కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేశామని తెలిపారు. 51 వేల మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, వారిలో ధైర్యాన్ని నింపామని, అలాగే ఉద్యోగాల కోసం ఎదిరిచూస్తున్న వారిలోనూ జాబ్ క్యాలెండర్ ద్వారా భరోసా కల్పిస్తున్నామని సీఎం వివరించారు.