రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా, లేదా ? : చంద్రబాబు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడంతో పట్టపగలే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను హతమారుస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కర్నూలు జిల్లా పెసరవాయిలో టీడీపీ నేతలు నాగేశ్వర్‍రెడ్డి, ప్రతాప్‍రెడ్డి హత్యల వెనుక వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, వైకాపా నేతలు, పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బంధువు చిన్నదినం కార్యక్రమం కోసం శ్మశానానికి వెళ్లి వస్తున్న నాగేశ్వర్‍రెడ్డి, ప్రతాప్‍రెడ్డిలను ప్రత్యర్థి వర్గం కారుతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేసిందన్నారు.
ఫ్యాక్షనిస్టు పోకడలతో సమాజానికి ఏం సంకేతాలు ఇస్తున్నారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా మారారు. పోలీసు వ్యవస్థ పనిచేస్తోందో లేదో అనే అనుమానం కలుగుతుందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 30 మంది టీడీపీ కార్యకర్తలను హతమార్చారన్నారు. వీరితో పాటు 1500 మందికి పైగా నాయకులపై దాడులు, ఆస్తుల ధ్వంసం ఘటనలకు పాల్పడితే పోలీసు వ్యవస్థ ఏమీ పట్టనట్లు వ్యవహరించడం విస్మయానికి గురి చేస్తోందన్నారు. రాష్ట్రంలో టీడీపీ కార్యాకర్తలపై చోటు చేసుకుంటున్న అవాంఛనీయ సంఘటనలు, హత్యాకాండకు ప్రభుత్వం, పోలీసు వ్యవస్తే బాధ్యత వహించాలి. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.