YS Viveka Case: వివేకా హత్య కేసు.. వీడనున్న 1:42 AM మిస్టరీ..!!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు ముగిసిందని భావిస్తున్న తరుణంలో, వివేకా కుమార్తె డాక్టర్ సునీత (Dr Sunitha) లేవనెత్తిన కొన్ని కీలక సందేహాలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు, పాక్షికంగా తదుపరి దర్యాప్తునకు అనుమతినిచ్చింది. ఈ తీర్పు, కేసును మరో మలుపు తిప్పే అవకాశం ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి. రఘురాం ఇచ్చిన తీర్పులో అత్యంత కీలకమైన అంశం… కిరణ్ యాదవ్ – అర్జున్ రెడ్డిల మధ్య జరిగిన సంభాషణ. ఈ కేసులో రెండో నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, ఏడో నిందితుడైన వై.ఎస్. భాస్కరరెడ్డి తమ్ముడు వై.ఎస్. ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డికి హత్య జరిగిన రోజున పంపిన సందేహస్పద సందేశంపై కోర్టు దృష్టి సారించింది. 2019 మార్చి 15 తెల్లవారుజామున 1:42 గంటల సమయంలో కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డికి “అర్జున్ అన్నా.. వివేకం సార్.. సార్ చనిపోయాడు అన్నా” అని మెసేజ్ పంపినట్లు సీబీఐ రికార్డుల్లో ఉంది. వాస్తవానికి వివేకా మరణవార్త ఉదయం 6 గంటల తర్వాతే బయటకు పొక్కింది. మరి అంతకంటే ముందే, అర్ధరాత్రి దాటిన సమయంలోనే ‘వివేకా చనిపోయారు’ అన్న విషయం వీరిద్దరికీ ఎలా తెలిసింది? అనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఇది ముందస్తు కుట్రను సూచిస్తోందన్న సునీత వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాల్ డేటా రికార్డుల ఆధారంగా లోతైన దర్యాప్తు చేసి, నెల రోజుల్లోగా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది.
డాక్టర్ సునీత తన పిటిషన్లో అనేక రాజకీయ, వ్యక్తిగత కోణాలను ప్రస్తావించారు. ముఖ్యంగా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఫోన్ వాడుకలో ఉందని, ఆ సమాచారం సీఎం జగన్‌కు, భారతికి చేరి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మాజీ సీఎస్ అజేయ కల్లం వాంగ్మూలం ప్రకారం.. ఉదయం 5 గంటలకు మేనిఫెస్టో చర్చ జరుగుతుండగా జగన్‌కు సమాచారం వచ్చిందని, దాన్ని భారతి చేరవేశారన్న కోణంలో దర్యాప్తు జరగలేదని సునీత ఆరోపించారు. అలాగే భరత్ యాదవ్ ఆర్థిక లావాదేవీలు, సాక్ష్యాల చెరిపివేతలో కృష్ణారెడ్డి సోదరుల పాత్రపై కూడా ఆమె సందేహాలు లేవనెత్తారు. అయితే, కోర్టు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం ఊహాజనిత లేదా రాజకీయపరమైన ఆరోపణల జోలికి వెళ్లకుండా, సాంకేతిక సాక్ష్యాధారాలు లభించే అవకాశం ఉన్న కిరణ్-అర్జున్ రెడ్డిల ఎపిసోడ్‌పై మాత్రమే దర్యాప్తునకు అనుమతించింది. సునీత పిటిషన్‌ను పాక్షికంగానే అనుమతిస్తూ, మిగిలిన అంశాలపై దర్యాప్తునకు నిరాకరించింది.
ఈ తీర్పు ద్వారా రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. దర్యాప్తు సంస్థలు చార్జిషీట్లు దాఖలు చేసినా, మౌలికమైన ప్రశ్నలకు ముఖ్యంగా హత్య సమయం, సమాచారం లీక్ అయిన సమయం లాంటి అంశాలపై ఇంకా పూర్తి సమాధానాలు లభించలేదని కోర్టు గుర్తించింది. రాజకీయ ఆరోపణల కంటే, ఫోన్ కాల్ డేటా, మెసేజ్‌లు వంటి శాస్త్రీయ ఆధారాలే కేసును నిలబెడతాయని న్యాయమూర్తి భావించారు. 1:42 AM మెసేజ్ నిజంగానే హత్యకు సంబంధించినదే అని తేలితే, అది నిందితులకు హత్య గురించి ముందుగానే తెలుసు అని నిరూపించడానికి బలమైన సాక్ష్యమవుతుంది.
సీబీఐకి కోర్టు విధించిన గడువు కేవలం ఒక నెల మాత్రమే. ఈ తక్కువ సమయంలో కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల మధ్య ఉన్న లింకును, వారికి హత్యతో ఉన్న సంబంధాన్ని సీబీఐ ఎలా నిగ్గుతేలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ అనుబంధ ఛార్జిషీట్ దాఖలైతే, వివేకా హత్య కేసు విచారణలో మరిన్ని కొత్త పేర్లు తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. మొత్తానికి, తండ్రి హత్య వెనుక ఉన్న సూత్రధారులను కనుగొనేందుకు సునీత చేస్తున్న న్యాయ పోరాటానికి ఈ తీర్పు ఒక చిన్న విజయంగానే భావించవచ్చు.






