CMRF: ఆర్థికంగా వెనకబడిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ : మంత్రి అనగాని
ఆర్థికంగా వెనకబడిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ (CM Relief Fund) అండగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satyaprasad) అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని టీడీపీ కార్యాలయంలో 41 మందికి రూ.86 లక్షల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా అనగాని మాట్లాడుతూ ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ (CMRF) ద్వారా రూ.10 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. ఐదేళ్లలో వైసీపీ పాలనలో ఏ పేదవాడికీ సీఎం రిలీఫ్ ఫండ్ అందలేదన్నారు. కోటి సంతకాలంటూ వైసీపీ నేతలు నాటకాలు మొదలు పెట్టారని విమర్శించారు. రెండేళ్లలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. వైసీపీ (YCP) అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా పూర్తి చేయలేదన్నారు. జగన్‌కు అప్పట్లో రిషికొండ (Rishikonda)పై ఉన్న శ్రద్ధ మెడికల్ కాలేజీలపై లేదని విమర్శించారు. 2019`24 లో రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్లారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో విశాఖ ఐటీ హబ్‌గా మారుతుందన్నారు.






