TDP: ఎమ్మెల్యేలపై బాబు సీరియస్ యాక్షన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలు టిడిపి వర్గాల్లో కలవరం సృష్టిస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన విషయంలో చాలా శ్రద్ధ పెట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. అభివృద్ధితోపాటుగా సంక్షేమ కార్యక్రమాలకు కూడా అప్పట్లో ఆయన శ్రీకారం చుట్టారు. కానీ ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే విషయంలో ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గాని ఘోరంగా విఫలమయ్యారు అనే విషయం అందరికీ క్లారిటీ ఉంది.
ఇక ఇప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అదే వ్యవహార శైలితో ఉండటం చంద్రబాబును చికాకు పెడుతోంది. ఏడాది పాలనలో అన్ని విషయాలు గమనిస్తున్న చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరు విషయంలో కూడా ఇటీవల కొన్ని సర్వేలు తెప్పించుకుని పరిశీలించడం మొదలుపెట్టారు. చాలామంది ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో వెనకబడి ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి. సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు అలాగే అమరావతి పనుల పునః ప్రారంభ విషయాలపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టకపోవడాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు.
ఇక కృష్ణ, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) వచ్చిన సమయంలో జనాల సమీకరణలో కూడా విఫలమయ్యారని ఆరోపణ వినబడింది. దీనిపై అప్పుడే చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల తల్లికి వందనం కార్యక్రమం తో పాటుగా రోడ్ల నిర్మాణాలపై అలాగే వైయస్ జగన్ చేస్తున్నటువంటి ఆరోపణల విషయంలో స్పందించకుండా సైలెంట్ గా ఉంటున్న ఎమ్మెల్యే లపై చంద్రబాబు నాయుడు.. ఇప్పటికే ఓ నివేదిక కూడా తెప్పించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రులకు సోషల్ మీడియా విషయంలో చంద్రబాబు పలుమార్లు క్లాస్ తీసుకున్నారు. త్వరలోనే ఎమ్మెల్యేలకు కూడా ఈ క్లాసు ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.