Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మౌనం వెనుక వ్యూహం 2029 ఎన్నికలేనా?

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా, ఇటీవల ప్రభుత్వ పనితీరుపై ఎక్కువగా స్పందించడం లేదు. ముఖ్యంగా, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ (TDP) హడావుడిగా కార్యక్రమాలు చేపట్టగా, జనసేన (JanaSena) మాత్రం వాటిలో అంతగా చురుకుగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో, పవన్ ఎలాంటి వ్యూహంతో మౌనం పాటిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీదే ప్రధాన ఆధిపత్యం సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ప్రభుత్వ కార్యక్రమాలను నడిపిస్తున్నారు. టీడీపీకి అధిక సంఖ్యలో మంత్రులు ఉంటే..జనసేనకు కేవలం కొన్ని శాఖలే ఉన్నాయి. ఈ పరిస్థితిలో, పాలనలో ఏర్పడే ప్రజా వ్యతిరేకత నుంచి దూరంగా ఉండేందుకు పవన్ ముందస్తుగా వ్యూహం వేసినట్టు కనిపిస్తోంది. ప్రజల్లో మిశ్రమ అభిప్రాయాలు వెల్లడి అవుతుండటంతో జనసేన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యాలపై స్పందించకుండా, తమకున్న శాఖలకే పరిమితమవుతోంది.
ఉదాహరణకు, అమరావతి (Amaravati) రాజధాని వివాదంలో ఆయన బాధ్యతాయుతంగా స్పందించి, తప్పు చేసినవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. కానీ, ఆ తరువాత మళ్లీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది కూడా వ్యూహపూరిత నిర్ణయంగా విశ్లేషిస్తున్నారు. తనకు అప్పగించిన శాఖలపై పవన్ ప్రత్యేక దృష్టి సారించి ప్రజలతో నేరుగా మమేకమయ్యే పనులు చేస్తుండగా, ప్రభుత్వ పాలనలో విభేదాలు లేకుండా ఉండాలన్న దృష్టితో ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు.
2024 ఎన్నికల్లో జనసేన గెలిచిన 21 స్థానాలు ఆ పార్టీకి బలాన్ని చాటినట్టు అయ్యాయి. ఈ విజయంతో పవన్ రాజకీయంగా మరింత ముందుకెళ్లాలని ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సుమారు 30-40 స్థానాలు గెలిస్తే, ఏ పార్టీకైనా తాను కీలకమైన మద్దతుదారుగా మారతానన్న ఆశయంతో నడుస్తున్నారు. కర్ణాటక (Karnataka)లో జేడీఎస్ పార్టీ (JDS) స్ట్రాటజీ ఫాలో అయితే, తాను 2029 తర్వాత సీఎం అభ్యర్థిగా నిలవొచ్చని భావిస్తున్నారు. అందుకే, టీడీపీతో పొత్తును కొనసాగిస్తూ, కాపు సామాజిక వర్గాన్ని (Kapu Community) తనకు అనుకూలంగా నిలిపేందుకు వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తున్నారు.ఇలా చూస్తే, పవన్ ప్రస్తుతం ఎక్కువగా ప్రచారంలో లేకపోయినా, రాజకీయంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ మౌనంగా భవిష్యత్తు ప్రణాళికలు వేస్తున్నట్లు కనిపిస్తోంది.