Chandrababu: కృష్ణా జలాల కోసం అటు తెలంగాణ ఇటు కర్ణాటక పోరు.. తగ్గేదే లేదంటున్న ఏపీ..
రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనే కాదు, పక్కనే ఉన్న కర్ణాటక (Karnataka) రాష్ట్రంతో కూడా కృష్ణా జలాల (Krishna Waters) అంశం మరింత క్లిష్టంగా మారుతోంది. ఈ సమస్యపై ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) పెద్దగా వ్యాఖ్యలు చేయకుండా నిశ్శబ్దంగా వ్యవహరించారు. అవసరమైనప్పుడు మాత్రమే స్పందిస్తూ, సముద్రంలో వృథాగా కలుస్తున్న నీటిని అన్ని రాష్ట్రాలు కలిసి ఉపయోగించుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ (Telangana) , కర్ణాటక మాత్రం తమ తమ వాదనలను గట్టిగా ముందుకు పెడుతున్నాయి.
ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం కృష్ణా నదీ జలాల కేటాయింపును తిరిగి పరిశీలించాలని కేంద్రాన్ని కోరుతోంది. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మాత్రమే జలాల పంపిణీ జరిగిందని, తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత కొత్త కేటాయింపు జరగలేదని చెబుతోంది. విభజన తర్వాత తమ సాగు భూములు పెరిగిన నేపథ్యంలో, వాటాకు సరిపోయే నీరు ఇప్పటికీ అందడం లేదని తెలంగాణ వాదిస్తోంది.
ఈ వివాదం తీవ్రం అవుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వ వాదన మాత్రం పెద్దగా బయటకు రావడం లేదు. జలవనరుల శాఖ కేంద్రానికి తమ అభిప్రాయాన్ని తెలియజేశామని చెబుతోంది. ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం ఈ మొత్తం వివాదంపై సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పరిణామాల మధ్య వైసీపీ (YCP) అధినేత జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) కూడా సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తూ, కృష్ణా జలాల పునః సమీక్ష వల్ల ముఖ్యంగా రాయలసీమ (Rayalaseema) ప్రాంతం తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
అంతలోనే ఈ వ్యవహారం త్వరలోనే సుప్రీంకోర్టు విచారణకు రానుండటంతో ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపధ్యంలో బుధవారం రాత్రి చంద్రబాబు జలవనరుల శాఖ అధికారులు, నిపుణులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కృష్ణా జలాల పునః సమీక్షకు ఏపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని స్పష్టం చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపుల ప్రకారమే ప్రస్తుత వినియోగం జరుగుతోందని సుప్రీంకోర్టుకు స్పష్టంగా వివరించాలని సూచించారు.
అలాగే, సముద్రంలో కలుస్తున్న అధిక నీటిని వృథా చేయకుండా వినియోగించుకునే అవకాశాన్ని కూడా కోర్టు ముందు బలంగా ప్రస్తావించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టి వాదనలు వినిపించే బాధ్యత జలవనరుల శాఖదేనని, ఈ విషయంలో ఎలాంటి వెనుకడుగు వేయరాదని చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తానికి, కృష్ణా జలాల వివాదం మళ్లీ ముందుకు వచ్చి రాజకీయ వేడి పెంచిన సమయంలో, ఏపీ ప్రభుత్వం కూడా కోర్టులో బలంగా నిలబడే సిద్ధతను చూపుతోంది. అయితే ఈ విషయంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుంది అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.






