అప్పుడిక తెలంగాణతో సమస్య ఉండదు.. చంద్రబాబుకు కేంద్రమంత్రి సూచన
రాష్ట్రాల మధ్య సాగునీటి వాటాల కోసం వివాదాలు సహజమేనని, వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సీఎం చంద్రబాబు(Chandrababu) కు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ (C.R. Patil) సూచించారు. కృష్ణా నదిపై తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏపీ అడ్డుచెప్పకపోతే, వివాదమే ఉండదన్నారు. ఇదే పరిష్కార మార్గంగా కనిపిస్తోందని చెప్పారు. ఢిల్లీలో చంద్రబాబు, పాటిల్ తో సమావేశమయ్యారు. ఆయన వెంట జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి ఉన్నారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కోరినవన్నీ ఇస్తున్నామని పాటిల్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) తొలిదశకు రూ.3000 కోట్లు కోరితే.. కేంద్రం రూ. 2,800 కోట్లు విడుదల చేసిందని గుర్తుచేశారు. స్టాప్‌వర్క్ ఆర్డర్ కు 2027 డిసెంబరు దాకా సడలింపు ఇచ్చామని చెప్పారు. తొలిదశను 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.
45.72 మీటర్ల ఎత్తున గరిష్ఠ స్థాయిలో 194.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరాన్ని సంపూర్ణంగా నిర్మించేందుకు సహకరించాలని పాటిల్‌ను సీఎం కోరారు. రెండో దశకు రూ.32 వేల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం కుడి, ఎడమల ప్రధాన కాలువలను 8123 క్యూసెక్కుల నుంచి 17,500 క్యూసెక్కుల సామర్థ్యానికి కేంద్ర జలసంఘం ఆమోదంతో విస్తరించామని, ఇందుకు అదనంగా అయిన ఖర్చును కేంద్రం రీయింబర్స్ చేయాలని అభ్యర్థించారు. గత నెల 2 నాటికి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయిందని, గ్యాప్-1, గ్యాప్-2, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎఫ్ఆర్)ను జలసంఘానికి ఇప్పటికే సమర్పించామని, దానిని ఆమోదించాలని కోరారు.
ఇవి కూడా చదవండి






