Chandrababu: పాలనలో నూతన యుగం..బిజినెస్ రూల్స్ సవరణకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పరిపాలనా వ్యవస్థలో పెద్ద మార్పుకు పూనుకున్నారు. ప్రభుత్వ పనితీరు ఎలా ఉండాలి, ఏ శాఖ ఎలా పనిచేయాలి అనే విషయాలను నిర్ణయించే బిజినెస్ రూల్స్ లో సవరణలు అవసరమని స్పష్టంగా ప్రకటిస్తూ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమరావతి (Amaravati)లో మంత్రులు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ (HODs), వివిధ శాఖల కార్యదర్శులతో జరిగిన సమీక్షలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ఉండేంత వరకు, ఆ అవసరాలకు అనుగుణంగా వ్యవస్థలు కూడా మారాలని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘దేశవ్యాప్తంగా రాజ్యాంగానికే మార్పులు సూచిస్తున్నప్పుడు, ఒక రాష్ట్ర పరిపాలనా నియమాలను మార్చడంలో తప్పేముంది?’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు వేగంగా, నాణ్యమైన సేవలు అందించడానికి బిజినెస్ రూల్స్‌లో మార్పులు అనివార్యమని తెలిపారు. దీని కోసం స్వయంగా తానే ముందుండి ప్రక్రియ ప్రారంభిస్తానని చెప్పారు.
ఈ మార్పుల్లో భాగంగా పలు కీలక చర్యలు చేపట్టనున్నారు. అధికారులకు మరిన్ని అధికారాలు ఇవ్వడం ద్వారా నిర్ణయాలు తీసుకునే వేగాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫైల్ క్లియరెన్స్‌కు నిర్దిష్ట గడువులు విధించి, ఆలస్యం లేకుండా పనులు జరిగేలా చూడనున్నారు. అలాగే అన్ని శాఖల్లోనూ ఐటీ విప్లవానికి అనుగుణంగా డిజిటల్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయనున్నారు. టెక్నాలజీ వినియోగం, డేటా ప్రాసెసింగ్, డేటాలేక్ వంటి ఆధునిక విధానాలను విస్తృతంగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలన కోసం ప్రతి శాఖను తప్పనిసరిగా ఆడిట్ పరిధిలోకి తీసుకురానున్నారు. అధికారులు, శాఖలు ప్రజలకు సమాధానం చెప్పే విధానాన్ని బలోపేతం చేయాలనే దృక్పథంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అనవసరమైన నిబంధనలను తొలగించి, వ్యవస్థలో సులభతరం తీసుకురావడం కూడా ఈ మార్పుల ముఖ్య భాగంగా ఉండనుంది.
ఇలాంటి బిజినెస్ రూల్స్ సవరణలు దేశంలో మొదటిసారి జరుగుతున్నాయా? అంటే కాదనే చెప్పాలి.. గతంలో 2018లో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం కూడా ఇలాంటి మార్పులు ప్రవేశపెట్టింది. కానీ కొన్ని తీర్మానాలు న్యాయస్థానం పరిశీలనలో నిలవలేదు. ప్రత్యేకంగా, శాంతిభద్రతలు , రెవెన్యూ శాఖలకు సంబంధించిన కొన్ని నిబంధనలను అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) రద్దు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, ఆ రాష్ట్రం కొన్ని మార్పులను అమలు చేసింది. ఇప్పుడు రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని, నూతన తరహా పరిపాలనా విధానానికి పునాది వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించటం రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ మార్పులతో పాలనలో వేగం పెరగడం, పారదర్శకత మరింత బలపడడం ఖాయమని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






