Yunus: భారత్ పక్కలో బల్లెం బంగ్లాదేశ్..?
షేక్ హసీనా(hasina) సారధ్యంలోని ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్ లోని మధ్యంతర ప్రభుత్వం పంథా మార్చింది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతోంది. దీనిలో భాగంగా తన దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునేదిశగా అడుగులేస్తోంది. తుర్కియే నుంచి ఆయుధాల కొనుగోలుకు బంగ్లాదేశ్ (Bangladesh) తహతహలాడుతోంది. ఇప్పటికే నిఘా, దాడికి వినియోగించే బేరక్తర్ డ్రోన్లను కొన్న ఆ దేశం తాజాగా తుల్పార్ లైట్ ట్యాంక్‌ను తీసుకోవాలని భావిస్తోంది. మొత్తం 26 ట్యాంకుల కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. దీంతో ఢాకా రక్షణవ్యూహంలో చెప్పుకోదగ్గ మార్పులు చోటుచేసుకొంటున్నాయి.
తుర్కియే, ఇటలీకి చెందిన సంస్థలు తుల్పార్ లైట్ ట్యాంక్‌లను అభివృద్ధి చేశాయి. ముఖ్యంగా సవాళ్లతో కూడిన భూములపై వినియోగించేలా దీనిని తయారుచేశారు. బంగ్లాదేశ్‌లోని బురద, వరద ప్రభావిత, పర్వత ప్రాంతాల్లో ఇవి బాగా పనిచేస్తాయి. అత్యాధునిక రక్షణ కవచాలకు తోడు వేగంగా ప్రయాణించే సత్తా దీనిసొంతం. సరిహద్దుల్లో బంగ్లాకు ఇవి కొంతమేరకు ఆధిక్యాన్ని అందిస్తాయి. ఇక ట్యాంకుల బరువు రకాన్ని బట్టి 25-45 టన్నుల మధ్యలో ఉంటాయి. నాటో ప్రమాణాలతో నిర్మించిన ఈ ట్యాంక్ మైన్స్, ఐఈడీలను కూడా తట్టుకోగలదు. ముఖ్యంగా సైనికపరమైన మార్పుల కంటే.. ఢాకా వ్యూహాత్మక మార్పులను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తోంది. ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కొనేలా బంగ్లాదేశ్ సిద్ధమవుతోంది.
రక్షణ రంగంలో బంగ్లాదేశ్ ఆయుధాల కోసం అత్యధికంగా తుర్కియేపై ఆధారపడుతోంది. ఆ దేశం కూడా దక్షిణాసియాలో తన పరపతి పెంచుకోవడానికి దీనిని వాడుకొంటోంది. మరోవైపు పాకిస్థాన్ నుంచి సైనిక శిక్షణ, సహకారం ఢాకా తీసుకుంటోంది. ప్రాంతీయ ఆధిపత్యాన్ని మార్చేలా తుర్కియే-పాక్-బంగ్లాదేశ్ కలిసి పనిచేస్తున్నాయన్న విశ్లేషణలు ఉన్నాయి. అంకారా ఇప్పటికే పాకిస్థాన్‌కు కార్వెట్టీలు, డ్రోన్లు సరఫరా చేస్తోంది. దీంతోపాటు ఇస్లామాబాద్‌కు చెందిన జలాంతర్గాముల ఆధునికీకరణకు సాయపడుతోంది.
బేరక్తర్ TB2 డ్రోన్‌ను పశ్చిమబెంగాల్ వద్ద మోహరించింది బంగ్లాదేశ్. ఈ డ్రోన్లను బంగ్లాదేశ్ 67వ ఆర్మీ యూనిట్ ఇంటెలిజెన్స్, నిఘా, గస్తీ కోసం వినియోగిస్తోంది. ఈ ఏడాది మొదట్లోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం తుర్కియే నుంచి బేరక్తర్ డ్రోన్లను కొనుగోలు చేసింది. 12 ఆర్డర్ చేయగా.. వాటిల్లో 6 ఇప్పటికే ఆ దేశానికి అందాయి. ఈ డ్రోన్ దాదాపు 25,000 అడుగుల ఎత్తు వరకు ఎగిరి లేజర్ గైడెడ్ బాంబులను ప్రయోగించగలదు. ముఖ్యంగా శతఘ్నులు, ట్యాంక్‌లకు ఈ రకం డ్రోన్లు సమస్యలు సృష్టించగలవు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ట్యాంకులను ఇవి దెబ్బతీశాయి ఈ డ్రోన్లు..






