Britain: మాగోల మీకెందుకు మస్క్..అమెరికా మిత్రదేశాల హైరానా..
అమెరికా నూతన ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎలన్ మస్క్.. మిత్రదేశాలకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. మిత్రదేశాల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నది సైతం తామే డిసైడ్ చేస్తామన్నట్లుగా మస్క్ ప్రవర్తించడంతో .. ఆయా దేశాల ప్రతినిధులకు చికాకు తెప్పిస్తోంది. మా అంతర్గత విషయాల్లో మీ జోక్యమేంటని.. అవినేరుగానే ప్రశ్నిస్తున్నాయి.
బ్రిటన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎలాన్ మస్క్ (Elon Musk) చేసిన వ్యాఖ్యలను ప్రధాని కీర్ స్టార్మర్(Keir stormer( తిప్పికొట్టారు. తప్పుడు, అసత్య వార్తలను మస్క్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బ్రిటన్ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో (Keir Starmer) ధ్వజమెత్తారు.
బ్రిటన్లో లేబర్ పార్టీ(Labour) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాన్ మస్క్ విమర్శలు గుప్పిస్తున్నారు. స్టార్మర్ను ప్రభుత్వం నుంచి తప్పించి.. కొత్తగా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల చోటుచేసుకున్న లైంగిక వేధింపుల కేసుల్లో ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై మండిపడ్డారు. 2008-13 మధ్యకాలంలో ఇంగ్లాండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డైరెక్టర్గా ఉన్న సమయంలో బాధితులకు స్టార్మర్ న్యాయం చేయలేదని ఆరోపించారు.
తాజాగా ‘‘నిరంకుశ ప్రభుత్వం నుంచి బ్రిటన్ ప్రజలకు అమెరికా విముక్తి కల్పించాలా?’’అని పేర్కొంటూ తన ఎక్స్ ఖాతాలో ఎలాన్ మస్క్ ఓ పోల్ పెట్టారు. ఇందుకు లక్షల సంఖ్యలో ప్రతిస్పందనలు వచ్చాయి. ఈ క్రమంలోనే మస్క్ తీరును తప్పుపట్టిన ప్రధాని స్టార్మర్.. ఆయన తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు ఇతర దేశాల రాజకీయాల్లో ఎలాన్ మస్క్ జోక్యం చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోరే(jonas gahr støre)పేర్కొన్నారు. ఇందుకోసం మస్క్ తన సామాజిక మాధ్యమాన్ని విస్తృతంగా వినియోగించుకుంటున్నారని ఆరోపించారు.ఆర్థిక వనరులు భారీ స్థాయిలో ఉన్న ఇలాంటి వ్యక్తి ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచి పరిణామం కాదన్నారు. ప్రజాస్వామ్య, మిత్రదేశాల మధ్య ఉండాల్సిన విధానం ఇది కాదన్నారు.






